Tirupati: తిరుపతిలో డీజీపీల, ఐజీపీల సదస్సు: ప్రధాని రాకతో ఏర్పాట్లు

Tirupati: డిసెంబర్‌లో తిరుపతిలో ప్రధాని మోదీ పాల్గొనే జాతీయ డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌కు లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Oct 2026 2:12 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతిలో డీజీపీల, ఐజీపీల సదస్సు: ప్రధాని రాకతో ఏర్పాట్లు

తిరుపతి: డిసెంబర్ మొదటి వారంలో తిరుపతిలో నిర్వహించనున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

గురువారం తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి, భద్రత, రవాణా, రహదారులు, విద్యుత్, వైద్య సేవలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అధికారులు, అతిథుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలు, హోటళ్లు, హోమ్‌స్టేల వివరాలను సేకరించి రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. వసతి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి, పెండింగ్ పనులు, మరమ్మతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే ఐసర్, ఐఐటీ, ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్‌లలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు సంయుక్తంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించి, ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నర్సింహులు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, విమానాశ్రయ అధికారులు, ఐసర్, ఐఐటీ, ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA