Sullurupeta: సూళ్ళూరుపేటలో ఫుడ్ మాఫియా కల్తీ ఆహారంతో ప్రాణాలకే ముప్పు

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో కల్తీ ఆహారపు దందా విచ్చలవిడిగా సాగుతోంది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 19 Jun 2026 5:09 PM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేటలో ఫుడ్ మాఫియా కల్తీ ఆహారంతో ప్రాణాలకే ముప్పు

సూళ్ళూరుపేట: రాకెట్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణం, నేడు కల్తీ ఆహారపు విషవలయంలో చిక్కుకుపోయి సామాన్యుడి ప్రాణాలను బలితీసుకుంటోంది. "అమ్మ పెట్టే మెతుకు తింటే అదృష్టం అంటారు.. బయట హోటల్ భోజనం తింటే ప్రాణం పోతుందంటారు! రుచుల కోసం ఆశపడితే విషం వడ్డించే ఈ వ్యాపారం.. రాకెట్ సిటీలో సాగుతున్న దౌర్భాగ్య పర్వం!" అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం చుట్టూ వెలసిన పరిశ్రమలు, పెరుగుతున్న జనాభా రద్దీని ఆసరా చేసుకుని, కొందరు వ్యాపారస్తులు నాణ్యతను గాలికి వదిలేసి, కనీస పరిశుభ్రత లేకుండానే ఆహార దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

గతంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన కుళ్ళిన మాంసాన్ని భారీగా పట్టుకున్నప్పుడు, పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, ఆనాటి దాడులు కేవలం ఆ ఒక్క రోజుకే పరిమితం కావడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంతో, నేడు పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్‌ను తాజా మాంసంగా నమ్మిస్తూ, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా, ఆహార భద్రతా అధికారులు (Food Safety) అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.

ప్రధాన రహదారుల పక్కన దుమ్ము, ధూళి, వాహనాల కాలుష్యం మధ్యే విచ్చలవిడిగా వంటకాలు వడ్డిస్తున్నా, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదు. నిత్యం అదే మార్గంలో తిరిగే అధికారుల కంటికి ఈ కల్తీ దందా ఎందుకు కనిపించడం లేదో ఎవరికీ తెలియదు. "అధికారుల కళ్లకు గంతలు కట్టిన ఆ మాయ.. కనిపించలేదా వారికి కల్తీ దందాలో ఉన్న పాయ? ప్రాణాలతో చెలగాటం.. అధికారుల మౌనం.. ఇది సామాన్యుడికి రాసిపెట్టిన శాపం!" అన్న ఆవేదన ప్రతి సామాన్యుడి గుండెల్లో మారుమోగుతోంది.

సూళ్ళూరుపేట పట్టణానికి ప్రాణప్రదమైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం, భక్తుల కొంగుబంగారమై సర్వరోగ నివారిణిగా వెలుగొందుతుంటే, అదే పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రం ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ విషతుల్యమైన ఆహారాన్ని అమ్ముతుండటం విడ్డూరం. అమ్మ ఆశీస్సులు లేని వ్యాపారమా? లేక అధికారం అండతో సాగుతున్న అక్రమమా? జనాభా సంఖ్యతో పాటు పెరుగుతున్న రోగాలను చూస్తుంటే, పట్టణ ప్రజలు అడగని పాపానికి విషతుల్యమైన ఆహారానికి బలవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి, తక్షణమే ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించాలి. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాకెట్ సిటీకి, చెంగాళమ్మ తల్లి చల్లని దీవెనలతో పాటు అసలైన గౌరవం, సామాన్యుడికి భద్రత లభిస్తుంది. లేనిపక్షంలో, బాధ్యతారాహిత్యంతో సాగుతున్న ఈ విషపూరిత వ్యాపారానికి అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story