Tirupati: మూడు రోజులుగా బోరు బంద్: ఎర్రమిరెడ్డిపాలెంలో నీటి తిప్పలు!
Tirupati: తిరుపతి జిల్లా తూకివాకం పంచాయతీ పరిధిలోని ఎర్రమిరెడ్డిపాలెంలో మూడు రోజులుగా బోరు మూతపడి తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు.
Tirupati: మూడు రోజులుగా బోరు బంద్: ఎర్రమిరెడ్డిపాలెంలో నీటి తిప్పలు!
తిరుపతి: తూకివాకం పంచాయతీ పరిధిలోని ఎర్రమిరెడ్డిపాలెం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి నీటిని అందించే బోరు గత మూడు రోజులుగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరును మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాల్సిన పంచాయతీ యంత్రాంగం ఇప్పటివరకు స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు కూడా పనిచేయడం లేదు. వీటిని మరమ్మతు చేయాలని పంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో చీకటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, వీధి దీపాల సమస్యలను సైతం పరిష్కరించడంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. తక్షణమే బోరుకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించడంతోపాటు, పనిచేయని వీధి దీపాలను బాగుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.




