Sriharikota: జాతీయ అంతరిక్ష దినోత్సవం: చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకలు!

Sriharikota: చంద్రయాన్-3 విజయాన్ని పురస్కరించుకుని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 14 Aug 2026 10:53 PM IST
Sriharikota
X

Sriharikota: జాతీయ అంతరిక్ష దినోత్సవం: చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకలు!

​శ్రీహరికోట: చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని తిరుపతిజిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్‌) ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. షార్‌లోని బ్రహ్మప్రకాశ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరవగా, షార్ అసోసియేట్ డైరెక్టర్ జి. రమేష్ బాబు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి నరసింగరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో అంతరిక్ష విజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, శాస్త్ర సాంకేతిక రంగాలపై యువత ప్రత్యేక ఆసక్తిని పెంచుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో తన సత్తాను ప్రపంచానికి చాటిందని, ఇలాంటి విజయాలు యువతలో శాస్త్ర విజ్ఞానంపై మరింత ఆసక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది 'వికసిత్ భారత్ దిశగా, ఆవిష్కరణ, సహకారం, ప్రపంచ మరియు అంతరిక్ష నాయకత్వం కోసం ఆకాంక్ష' అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేశాన్ని అంతరిక్ష రంగంలో స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు ప్రపంచ స్థాయిలో నాయకత్వ స్థానానికి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్ డీఎస్ సీ షార్ తో పాటు ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి, నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గదంకి సమన్వయంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి ప్రాంతాల్లోనూ జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, జాతీయ స్థాయి ప్రధాన కార్యక్రమం ఈ నెల 23న అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో నిర్వహించనున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో షార్ ఎస్ఎంపీ అండ్ ఎస్పీ జనరల్ మేనేజర్, జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహణ ఉపకమిటీ చైర్మన్ ఎన్.ఎన్. నరసింహమూర్తి, షార్ కంట్రోలర్ వై. శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story