Srikalahasti: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ వేడుకలు!
Srikalahasti: శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ కార్మికులనే నియమించాలని అంజూరు డిమాండ్.
Srikalahasti: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ వేడుకలు!
Srikalahasti: శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు.
ముందుగా ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ... కార్మికుల కష్టనష్టాల్లో అండగా నిలిచి, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకే కార్మిక సంఘాలు ఏర్పడతాయని అన్నారు. నాయకుల కృషి, కార్మికులకు ఇచ్చే భరోసాతోనే ఎంప్లాయిస్ యూనియన్ 75 ఏళ్లుగా నిలకడగా కొనసాగుతోందన్నారు. యూనియన్ వందేళ్ల వేడుకలను కూడా ఘనంగా జరుపుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుపై ఆర్టీసీ కార్మికుల్లో నెలకొన్న అనిశ్చితిని ప్రస్తావించిన ఆయన... ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినా, వాటిలో డ్రైవర్లు, కండక్టర్లుగా ఆర్టీసీ ఉద్యోగులనే నియమించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం చేపట్టే ప్రతి ఉద్యమంలో వారికి అండగా నిలిచి, వారితో కలిసి పయనిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జరిగిన 16 వేతన సవరణల్లో 13 సార్లు ఎంప్లాయిస్ యూనియన్ కీలక పాత్ర పోషించిందని, వీకాఫ్‌తో పాటు డ్రైవర్లు, కండక్టర్లు, వర్కర్లు, గ్యారేజ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిందని తెలిపారు. ఎంప్లాయిస్ యూనియన్ జెండా ఎల్లప్పుడూ రెపరెపలాడాలని వాయులింగేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు అంజూరు తారక శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిపో యూనియన్ నాయకులు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు, ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




