Srikalahasti: శ్రీకాళహస్తి దళితుల శ్మశానానికి దారి ఏదీ?

Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్ దళితవాడల్లో కెవిపిఎస్ పల్లె నిద్ర. శ్మశానానికి దారి లేక ఇబ్బందులు పడుతున్న దళితులు. స్పందించాలని ఎమ్మెల్యేను కోరిన అంగేరి పుల్లయ్య.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 18 July 2026 5:07 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి దళితుల శ్మశానానికి దారి ఏదీ?

శ్రీకాళహస్తి: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న బొజ్జల ఇలాకాలో దళితుల శ్మశానానికి దారే లేకుండా పోయిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అంగేరి పుల్లయ్య విమర్శించారు. శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ఊరందూరు, జింగిలిపాలెం, పెంకులపాడు, నారాయణపురం దళితవాడల్లో శుక్రవారం రాత్రి కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు సామాజిక శంఖారావం పేరిట పల్లె నిద్ర చేశారు.

అక్కడి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ఊరందూరు దళితులు తరాలుగా శ్మశాన దారి సమస్యతో అగచాట్లు పడుతున్నారని వాపోయారు. ఇదే గ్రామం నుంచి బొజ్జల కుటుంబం రాజకీయంగా ఉన్నత పదవులు పొందిందనీ, దళితులు వారి గెలుపులో ఏళ్ళుగా భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు.

అయినా దళితుల శ్మశానానికి దారి సౌకర్యం లేదంటే ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించి ఊరందూరు దళితులకు శ్మశాన దారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో ఊరందూరు, నారాయణపురం పంచాయతీలను శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కలిపిన కారణంగా గ్రామస్తులు వద్దంటూ కోర్టుకు వెళ్ళారనీ, న్యాయం స్థానం స్టే ఇచ్చినా ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో సుమారు 250 కుటుంబాలు గత ఐదేళ్లుగా ఉపాధి హామీ పనులకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ చూపి పేదలకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా జింగిలిపాలెం దళితుల శ్మశానానికి ప్రభుత్వమే దారి సౌకర్యం కల్పించిందనీ, అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు రైతులు దారిని ఆక్రమించి మూసేశారని తెలిపారు. దీనిపైనా ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంధం మణి, కేవీపీఎస్ నాయకులు పెనగడం గురవయ్య, వెంకటేష్, భారతి రెడ్డి, ఈశ్వర్, ప్రకాశం పంతులు తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story