Srikalahasti: శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

Srikalahasti: శ్రీకాళహస్తిలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్. సరైన పత్రాలు లేని వాహనాల సీజ్. అద్దెదారుల ధ్రువీకరణ తప్పనిసరని హెచ్చరిక. మహిళా భద్రతపై అవగాహన.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 19 July 2026 7:43 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి డీఎస్పీ ఆదేశాల మేరకు బి.ఎన్. కండ్రిగ సర్కిల్ పరిధిలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో, తొట్టంబేడు ఎస్ఐ బాలకృష్ణతో పాటు సబ్ డివిజన్ సిబ్బంది తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్‌లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో అనుమానిత వ్యక్తులు, రికార్డులు లేని వాహనాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగదారుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని మూడు మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ బాలకృష్ణ స్థానికులతో మాట్లాడుతూ... స్థానికేతరులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల ధ్రువీకరణ పత్రాలు, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా సేకరించి పోలీస్ స్టేషన్‌కు అందజేయాలని సూచించారు. ఈ నిబంధనలు పాటించకుండా అద్దెకు ఇచ్చిన ఇళ్లలో నేరాలు జరిగితే యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం సీఐ లక్ష్మీనారాయణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ... గంజాయి నిర్మూలనతో పాటు మహిళల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అలాంటి కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన ప్రజలు 1972 టోల్ ఫ్రీ నంబర్ లేదా 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నేరస్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణ, బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై కూడా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story