Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానంలో అంబులెన్స్ సేవలపై భక్తుల ఆగ్రహం
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మూర్ఛపడి రక్తగాయాలైన ఓ భక్తుడికి సకాలంలో వైద్యం అందలేదు.
Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానంలో అంబులెన్స్ సేవలపై భక్తుల ఆగ్రహం
Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు ఆలయం మూడో గేటు సమీపంలో అకస్మాత్తుగా మూర్ఛపడి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు రక్తగాయాలు కూడా అయ్యాయి.
అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం దేవస్థానంలో అందుబాటులో ఉన్న అంబులెన్స్ సేవలకు ఫోన్ చేసినప్పటికీ, అరగంటకు పైగా సమయం గడిచినా అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దీంతో ఆ భక్తుడి బంధువులు తీవ్ర ఆందోళనకు గురై, చివరకు ఆటోలో సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ సమయానికి అందుబాటులో లేకపోవడంపై స్థానికులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేవస్థానానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంబులెన్స్ సేవల నిర్వహణపై సమీక్ష నిర్వహించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




