Renigunta: పంచాయతీ ఆఫీస్ పక్కనే కుక్కల బెడద.. పట్టించుకోని అధికారులు!

Renigunta: పంచాయతీ పరిధిలోని పాంచాలి నగర్‌లో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. పంచాయతీ కార్యాలయం పక్కనే గుంపులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 8 Sept 2026 8:47 PM IST
Renigunta
X

Renigunta: పంచాయతీ ఆఫీస్ పక్కనే కుక్కల బెడద.. పట్టించుకోని అధికారులు!

రేణిగుంట: రేణిగుంట మండలం రేణిగుంట పంచాయతీ పరిధిలోని పాంచాలి నగర్‌లో కుక్కల బెడద రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఏకంగా పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఉన్న వీధిలోనే గుంపులుగా కుక్కలు సంచరిస్తుండటంతో స్థానికులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీధిలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

కుక్కలు రోడ్డుపైనే గుంపులుగా తిరుగుతూ వాహనాలకు అడ్డుగా వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల వెంట పరుగులు తీయడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పాదచారుల వెంట కుక్కలు పరుగులు తీస్తూ కరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

అధికారుల దృష్టికి కనిపించడంలేదా?

పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కుక్కల గుంపులు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిత్యం ఎదురవుతున్న ఈ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కుక్కల దాడులతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని చెబుతున్నారు. రాత్రివేళ పరిస్థితి మరింత భయానకంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story