Sullurpeta: వినాయక చవితి వేడుకలపై సీఐ మురళీకృష్ణ నిబంధనలు
Sullurpeta: సూళ్ళూరుపేట, తడ ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని సీఐ మురళీకృష్ణ స్పష్టం చేశారు.
Sullurpeta: వినాయక చవితి వేడుకలపై సీఐ మురళీకృష్ణ నిబంధనలు
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఎం.మురళీకృష్ణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తడ, సూళ్ళూరుపేట ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన పండుగను మనమందరం ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ పేరుతో ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పండుగ సమయంలో పాటించాల్సిన కఠిన నిబంధనలను సీఐ మీడియా ద్వారా ప్రజలకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు వివరించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పండుగ వేళ గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు విక్రయించడం, సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఉత్సవ మండపాల వద్ద ఎలాంటి డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌కు పూర్తిగా అనుమతి లేదని తేల్చిచెప్పారు.
రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెట్టున లౌడ్‌స్పీకర్లు వాడకూడదని, ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు లేదా శాంతిభద్రతలకు ఎక్కడైనా, ఎవరివల్లనైనా చిన్న అనుమానం కలిగినా, అవాంఛనీయ ఘటనల జాడ కనిపిస్తే వెంటనే తనకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు.
గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ నిబంధనలన్నీ అని, అందరి సహకారంతో సూళ్ళూరుపేట, తడ ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు విజయవంతం కావాలని సీఐ మురళీకృష్ణ ఆకాంక్షించారు.




