Sullurpeta: సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికలు: రౌడీషీటర్లకు సీఐ వార్నింగ్

Sullurpeta: సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని 250 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ మురళీకృష్ణ తెలిపారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 29 Oct 2026 2:24 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికలు: రౌడీషీటర్లకు సీఐ వార్నింగ్

​సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సుళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ మీడియాముఖంగా మాట్లాడుతూ రౌడీషీటర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల వేళ ఎవరైనా అల్లర్లకు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.

​నవంబర్ 1వ తేదీన జరగనున్న ఈ ఎన్నికల కోసం మున్సిపాలిటీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలతో పాటు 250 మంది పోలీసు సిబ్బందిని ఈ విధులకు కేటాయించారు. మున్సిపల్ పరిధిని ప్రత్యేక రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు బలగాలను మోహరించామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.

​ఎన్నికల ప్రచార గడువు నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5:00 గంటలతో ముగుస్తుందని, ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) కింద కఠిన కేసులు నమోదు చేస్తామని, టౌన్ అంతటా ఎంసీసీ ప్రత్యేక బృందాలు తిరుగుతూ వీడియో గ్రాఫీ ద్వారా ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంటాయని గుర్తుచేశారు.

​ప్రచారం ముగిసే సమయం నాటికి మున్సిపాలిటీలో ఓటు హక్కు లేని బయటి వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే టౌన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని సీఐ స్పష్టం చేశారు. లాడ్జీలు అన్నీ పోలీసుల పూర్తి నిఘాలో ఉంటాయని, బయటి ప్రాంతాల నుంచి ప్రచారానికి తెచ్చుకున్న వాళ్ళను రాజకీయ పార్టీల వారే స్వయంగా పంపించేయాలని, లేనిపక్షంలో ఎంసీసీ నిబంధనల ప్రకారం చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికలను అస్థిరపరచాలని చూసే రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు ఎవరైనా సరే పోలీసుల నిఘాలో ఉంటారని హెచ్చరించారు. పోలింగ్ రోజు ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, పోలీసు శాఖకు అందరూ సహకరించాలని సీఐ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta