Sullurpeta: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి హత్య, ఇద్దరు అరెస్ట్

Sullurpeta: సూళ్లూరుపేటలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని దోపిడీ కోసం హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పి చెంచుబాబు మీడియాకు వెల్లడించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 31 Aug 2026 11:17 PM IST
Sullurpeta
X

Sullurpeta: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి హత్య, ఇద్దరు అరెస్ట్

సూళ్లూరుపేట: మద్యం మత్తులో ఉన్న ఓ అమాయకుడిని ఆసరాగా చేసుకుని, దోపిడీ దొంగలు అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన సంఘటన తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను నాయుడుపేట డిఎస్పి చెంచుబాబు సోమవారం విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

​డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 21వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మద్యం తాగి, స్థానిక నిధి వైన్ షాప్ సమీపంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారి తెలియక అయోమయంతో తిరుగుతున్నాడు. అది గమనించిన ఇద్దరు ముద్దాయిలు, అతడి వద్ద విలువైన నగదు లేదా వస్తువులు ఉంటాయని భావించి పథకం వేశారు. సదరు వ్యక్తికి సహాయం చేస్తామన్నట్లు నమ్మించి, తమ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని కేఆర్‌పీ వెహికల్ గ్యారేజ్ వెనుక ఉన్న మణిదీప్ లేఅవుట్‌కు తీసుకెళ్లారు.

​అక్కడ అతడికి మరికొంత మద్యం తాగించి, కావాలని గొడవకు దిగారు. గొడవ తీవ్రం కావడంతో నేరస్థులు రాక్షసత్వంతో ప్రవర్తించారు. రాయితో ముఖంపై తీవ్రంగా కొట్టి, బీర్ బాటిల్‌తో మెడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావమై సదరు బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం అతడి చేతికి ఉన్న వాచ్‌ను దోచుకుని, మృతదేహంతో పాటు హత్యకు ఉపయోగించిన రాయిని సమీపంలోని బురద మడుగులోకి విసిరేసి ఆధారాలు దాగేలా చేశారు.

​తర్వాత బాధితుడి బ్యాగును వెతకగా అందులో దుస్తులు, స్టీల్ పూరి టిఫిన్ బాక్స్, రూ. 200 నగదు మాత్రమే లభించాయి. ఆ డబ్బును తీసుకున్న నిందితులు, మిగిలిన సామాగ్రితో కూడిన బ్యాగును మన్నే ముత్తరి గ్రామానికి వెళ్లే రోడ్డులోని కోళ్లమిట్ట స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి తగలబెట్టి పరారయ్యారు.

​బాధితుడి గుర్తింపు లేకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. అయితే, తన పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అత్యంత సాంకేతిక నైపుణ్యంతో దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా సమాచారంతో సోమవారం (ఆగస్టు 31న) ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డిఎస్పి జీ. చెంచుబాబు వెల్లడించారు. సమర్థవంతంగా పనిచేసి కేసును త్వరగా ఛేదించిన సీఐ, ఎస్సై, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story