Sullurpeta: సూళ్ళూరుపేటలో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే డా. విజయశ్రీ
Sullurpeta: సూళ్ళూరుపేట నియోజకవర్గంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.62.28 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శంకుస్థాపన చేశారు.
Sullurpeta: సూళ్ళూరుపేటలో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే డా. విజయశ్రీ
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతుండటంతో స్థానిక ప్రజలు విశేష సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరైన రూ.1 కోటిలో, మొదటి విడతగా రూ.62.28 లక్షల అభివృద్ధి పనులకు శనివారం ఆమె శంకుస్థాపనలు చేయడం ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
నాగరాజపురంలో రూ.28.57 లక్షలతో సీసీ రోడ్డు పనులు, మన్నారుపోలూరులో రూ.33.71 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన సందర్భంగా ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ప్రతీ గడపకూ తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరించారు.
ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే పలకరింపు మాటలు:
పనుల ప్రారంభోత్సవ సమయంలో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ.. "అమ్మా, మీ ఇళ్ల మధ్య ఉండే రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి నాకు పూర్తిగా తెలుసు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ చిన్న సమస్య ఉన్నా నాకు నేరుగా చెప్పండి. మన సూళ్ళూరుపేటను అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా బాధ్యత. కూటమి ప్రభుత్వం మీ సంక్షేమం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఎప్పుడూ ముందుంటుంది. మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాను" అంటూ ఎంతో ఆప్యాయంగా, భరోసానిచ్చేలా మాట్లాడారు.
ఎమ్మెల్యే నిబద్ధతను, ఆమె ఆప్యాయ పలకరింపును చూసి స్థానిక మహిళలు, వృద్ధులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించే మహిళా నాయకురాలు మాకు దక్కడం అదృష్టమని, నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని ప్రజలు సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




