Sullurpeta: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే

Sullurpeta: సూళ్ళూరుపేటలో ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ. పిల్లలకు స్వయంగా బాలమృతం ప్లస్ తినిపించిన వైనం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 23 July 2026 9:42 PM IST
Sullurpeta
X

Sullurpeta: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే

సూళ్ళూరుపేట: తిరుపతిజిల్లా ​సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి, మహిళలు మరియు పిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. సూళ్ళూరుపేటలో నిర్వహించిన అంగన్వాడీ కేంద్రాల ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

​ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు "బాలమృతం ప్లస్" రుచి చూపించారు. వేదిక వద్దకు వచ్చిన ప్రతి ఒక్క చిన్నారితోనూ ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. స్వయంగా పిల్లాడిని ఎత్తుకుని ఎంతో ప్రేమగా తినిపించిన క్షణాలు అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఆమె చూపిన ఈ మాతృమూర్తి హృదయం అక్కడి వారందరి ప్రశంసలను అందుకుంది.

​గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లలకు 6 నెలల నుండి 6 సంవత్సరాల వయస్సు వరకు అంగన్వాడీల ద్వారానే సరైన ప్రాథమిక సంరక్షణ, విద్య అందుతాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం బాలల అభివృద్ధి కోసమే ఐసీడీఎస్ (ICDS) వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి, పిల్లల మేధో వికాసానికి, మైలురాళ్ల సాధనకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

​గ్రామాల్లో చిన్న పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు (లాక్టేటింగ్ మదర్స్), యాంటీ నేటల్ కేర్, అడోసెంట్ (యువతి) బాలికల ఆరోగ్యం పట్ల అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పల్లెల్లో మహిళల్లో తరచుగా కనిపించే రక్తహీనత (అనీమియా) నివారణకు ప్రభుత్వం అందిస్తున్న బాలమృతం, వ్యాక్సిన్లు, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు. ముఖ్యంగా SAM (తీవ్ర పోషకాహార లోపం) మరియు MAM (మధ్యస్థ పోషకాహార లోపం)తో బాధపడుతున్న పిల్లల కోసం "బాలమృతం ప్లస్" ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా అందించాలని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో సీడీపీవో శ్రీమతి జ్యోతి కిరణ్, విజయవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్ (టాటా ట్రస్ట్) ప్రోగ్రామ్ ఆఫీసర్ కె. అరుణ కుమారి సూపర్‌వైజర్లు మంజుష, అంకంమ, లక్ష్మిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. గతంలో అంగన్వాడీల జీతాలు, సంక్షేమంపై అనేక అభ్యర్థనలు ఉండేవని, నేడు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల పిల్లలకు కూడా "తల్లికి వందనం" వర్తింపజేస్తామని ప్రకటించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి శాంక్షన్ అయిన భవనాలతో పాటు, పెండింగ్‌లో ఉన్న భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story