Sullurpeta: సూళ్ళూరుపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ప్రారంభం

Sullurpeta: సూళ్ళూరుపేటలో నేరాల నియంత్రణ కోసం రూ.15 లక్షలతో ఏర్పాటు చేయనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, 110 సీసీ కెమెరాల పనులను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 24 Sept 2026 4:18 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ప్రారంభం

​సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జి.చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక శ్రద్ధ వహించి పట్టణంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కోసం అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

అందులో భాగంగా సూళ్ళూరుపేట పట్టణంలో రూ. 15 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు మరియు సీసీ కెమెరాల అమరిక పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం పట్టణంలోని ప్రధాన మెయిన్ సెంటర్లలో కెమెరాలను అమర్చే (సెట్ చేసే) పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

​ఈ సందర్భంగా సీఐ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన కూడళ్ళు, వ్యాపార సముదాయాలు, సమస్యాత్మక ప్రాంతాల వద్ద మొత్తం 50 కేంద్రాలలో 110 అత్యధునిక సీసీ కెమెరాలను అమర్చడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి నిరంతర పర్యవేక్షణను అందుబాటులోకి తెస్తామని, ఇకపై పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నేరాలను ముందస్తుగా అరికట్టడమే లక్ష్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 24 గంటలూ నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు

​ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సులువవుతుందని, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని సులభంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు.

అంతేకాకుండా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవచ్చని, ఏదైనా నేరం జరిగినప్పుడు కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చేయడానికి సీసీ కెమెరా దృశ్యాలు శాస్త్రీయ ఆధారంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

పోలీసుల నిఘాతో పాటు ప్రజలు, వర్తకులు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించి ప్రతి షాపు, నివాస సముదాయం వద్ద వీధి వైపు చూసేలా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అడ్డుకట్టకు సీఐ మురళీకృష్ణ తీసుకున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ జి. అజయ్ కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta