Sullurpeta: సూళ్లూరుపేట: ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం సామంతమల్లంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఎంపీడీవో వై. వెంకటేశ్వర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 26 Sept 2026 6:01 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్లూరుపేట: ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో

తిరుపతి జిల్లా: సూళ్లూరుపేట మండలంలోని సామంతమల్లం గ్రామపంచాయతీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలోని ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై. వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. రాజశేఖర్, పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎంపీడీఓ వై. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... గ్రామపంచాయతీని స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి రోజూ ఇళ్ల నుంచి సేకరిస్తున్న తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించామని చెప్పారు. చెత్తను ఇళ్ల వద్దే వేర్వేరుగా సేకరించడం, వాహనాల్లో తరలించడం, కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేసే ప్రక్రియలను స్వయంగా తనిఖీ చేసినట్లు వెల్లడించారు.

​సేకరించిన తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారుచేసే ప్రక్రియను, పొడి చెత్తను వేరు చేసి పునర్వినియోగం కోసం రీసైక్లింగ్‌కు పంపించే విధానాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా తమ ఇళ్లలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించినట్లు తెలిపారు.

​ప్రాసెసింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. "పరిశుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన సమాజం" అనే లక్ష్యంతో సామంతమల్లం గ్రామాన్ని జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఎంపీడీఓ వై. వెంకటేశ్వర రావు వెల్లడించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta