Sullurpeta: సూళ్ళూరుపేట చెంగాళమ్మ అమ్మవారికి పోలీసుల అధికారిక సారె సమర్పణ!
Sullurpeta: సూళ్ళూరుపేట చెంగాళమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సారె సమర్పించారు. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం.
Sullurpeta: సూళ్ళూరుపేట చెంగాళమ్మ అమ్మవారికి పోలీసుల అధికారిక సారె సమర్పణ!
Sullurpeta: తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సూళ్ళూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రుల వేడుకలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా సాగాయి. ప్రతీ ఏడాదీ పాటించే ఆనవాయితీ ప్రకారం నవరాత్రుల 9వ రోజున సూళ్ళూరుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి అత్యంత ఘనంగా అధికారిక సారె సమర్పించారు. సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ నుండి శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు మంగళవాయిద్యాల హోరు, భక్తుల జయధ్వనాల నడుమ పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు భారీ ఊరేగింపుగా తరలివచ్చారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో, నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళికృష్ణ నాయకత్వంలో ఎస్సైలు గంటా అజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం రాజు, కొండప్ప నాయుడు, జీవి చౌదరిలతో పాటు పోలీస్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూలు, తాంబూలం తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబు మాట్లాడుతూ, శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దయాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ సారె సమర్పణ మహోత్సవంలో అధికారులతో పాటు సిబ్బంది కుటుంబాలు కూడా పాలుపంచుకోవడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు.
అనంతరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళికృష్ణ మాట్లాడుతూ, చెంగాళమ్మ తల్లి ఆశీస్సులతో ప్రాంతంలో శాంతిభద్రతలు సదా విలసిల్లాలని, ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. పోలీస్ శాఖ తరఫున ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతమని, ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇక శరన్నవరాత్రుల 9వ రోజు సందర్భంగా శ్రీ చెంగాళమ్మ తల్లి భక్తులకు 'శ్రీ రాజరాజేశ్వరి దేవి' దివ్య అలంకారంలో దర్శనమిచ్చారు. సర్వాభరణ భూషితయై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి, దివ్య ఆశీస్సులు అందుకున్నారు.




