Sullurpeta: సూళ్ళూరుపేట, తడలో బహిరంగ ప్రచారానికి తెర.. సీఐ హెచ్చరిక

Sullurpeta: నవంబర్ 29న రెండో విడత పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో సూళ్ళూరుపేట, తడ మండలాల్లో ప్రచారం బంద్; స్థానికేతరులు వెళ్లాలని సీఐ మురళీకృష్ణ హెచ్చరిక.

KKV Sudhakar, Sullurupeta
Published on: 27 Nov 2026 11:31 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట, తడలో బహిరంగ ప్రచారానికి తెర.. సీఐ హెచ్చరిక

సూళ్ళూరుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29న (ఆదివారం) జరగనున్న నేపథ్యంలో సూళ్ళూరుపేట, తడ మండలాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు ఆధ్వర్యంలో ఎన్నికల నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994లోని సెక్షన్ 214 ప్రకారం, పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచే (శుక్రవారం, నవంబరు 27 సాయంత్రం 5 గంటల నుండి) బహిరంగ ప్రచారానికి తెరపడిందని ఆయన వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, మైకులు (లౌడ్ స్పీకర్లు), కచేరీలు, నాటకాలు, ఇతర వినోద కార్యక్రమాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందన్నారు. అలాగే టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి ప్రచారం చేయరాదని, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా ఖాతాల్లోని ఎన్నికల ప్రకటనల లింకులను తక్షణమే 'ప్రైవేట్ మోడ్'లోకి మార్చుకోవాలని సీఐ ఆదేశించారు.

​సూళ్ళూరుపేట, తడ మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్లు కాని అభ్యర్థులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు తక్షణమే ఆ ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని, ఎవరికి వారు తమ సొంత గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండాలని సీఐ ఎం. మురళీకృష్ణ పోలీసు నోటీసుల ద్వారా హెచ్చరించారు.

ఇతర గ్రామ పంచాయతీల పరిధిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించరాదని, స్థానికేతరుల కదలికలను అడ్డుకునేందుకు పంచాయతీ సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు హోటళ్లు, లాడ్జీలు, కమ్యూనిటీ హాళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రెండు మండలాల్లోని రౌడీషీటర్లు, గంజాయి విక్రేతలు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా అల్లర్లకు పాల్పడినా ఏపీ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 214తో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఓటర్లందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా శాంతియుతంగా, సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta