Sullurpeta: కూటమి ప్రభుత్వంలోనే సూళ్ళూరుపేట ప్రగతి: ఆదినారాయణరెడ్డి
Sullurpeta: కూటమి పాలనలోనే సూళ్ళూరుపేట ప్రగతి సాధ్యమని, గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరిట పేదలను మోసం చేసిందని తాడిప్రతి ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
Sullurpeta: కూటమి ప్రభుత్వంలోనే సూళ్ళూరుపేట ప్రగతి: ఆదినారాయణరెడ్డి
సూళ్ళూరుపేట: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల జీవితాలతో చెలగాటమాడారని శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ తాడిప్రతి ఆదినారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని సత్యసాయి కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మహిళ అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో వేగంగా దూసుకుపోతున్నారని కొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన హయాంలో చేసిన ఒక్క అభివృద్ధి పనినైనా చూపించగలరా అని నిలదీశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వికాసానికి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
మన మహిళా ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గంలో అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో పేదల పేర్లపై రుణాలు తీసుకుని, వారికి ఇళ్లు కేటాయించకుండానే ఖాతాల నుంచి డబ్బులు కోత విధించిందని మండిపడ్డారు.
ఇళ్లు రాక, దిక్కుతోచక రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలు తమ తాళిబొట్లు తాకట్టు పెట్టి మరీ వాయిదాలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరాచకం వల్ల నేటికీ బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ దెబ్బతిని పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతుంటే ప్రతిపక్షం ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షంగా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప అరాచకాలు సృష్టించి గెలిచే రోజులు పోయాయని హితవు పలికారు.
గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలు లాక్కెళ్లడం, పోలీసులను ఉపయోగించి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి, వైసీపీ చేసిన అరాచక పాలనకు మధ్య జరిగే పోటీలో ధైర్యం ఉంటే నేరుగా వచ్చి పోటీ పడి గెలవాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సవాల్ విసిరారు.




