Sullurupeta: సూళ్ళూరుపేట బీసీ బాలికల వసతి గృహ దుస్థితి.. ప్రాణాలు గుప్పిట్లో విద్యార్థులు
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట బీసీ బాలికల హాస్టల్ శిథిలావస్థకు చేరింది. భవనాన్ని మార్చాలని, వసతులు కల్పించాలని ఎమ్మెల్యే విజయశ్రీకి తల్లిదండ్రుల వేడుకోలు.
Sullurupeta: సూళ్ళూరుపేట బీసీ బాలికల వసతి గృహ దుస్థితి.. ప్రాణాలు గుప్పిట్లో విద్యార్థులు
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణ నడిబొడ్డున ఉన్న బిసి బాలికల వసతి గృహం 82 మంది విద్యార్థులకు నరకప్రాయంగా మారింది. రెండు అంతస్తుల ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర స్థితిలో ఉంది.
గతంలో ఈ భవనంపై మీడియాలో కథనాలు రావడంతో, పైస్థాయి అధికారులు స్పందించి మరో భవనాన్ని నిర్మించారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ పాత భవనాన్ని ఇంకా ఖాళీ చేయకుండా, విద్యార్థులను అందులోనే కొనసాగిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
వర్షం వస్తే చాలు, పైకప్పు నుంచి నీరు కారుతూ గదులన్నీ చిత్తడిచిత్తడిగా మారుతున్నాయి. కనీస సౌకర్యాలైన బాత్‌రూమ్ తలుపులు కూడా సరిగ్గా లేవు. గతంలో ఇదే పరిస్థితి ఉంటే మీడియా జోక్యంతో బాగుచేశారు, కానీ నాణ్యత లేని పనుల వల్ల మళ్ళీ అదే దుస్థితి నెలకొంది.
ఇక వసతి గృహంలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం కూడా నాణ్యత లేదని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సిన దుస్థితి కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారు అంటేనే "మాట ఇస్తే తప్పని వ్యక్తి" అని, సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించే వ్యక్తిత్వం ఆమెదని నియోజకవర్గంలో పేరుంది.
అందుకే, "అమ్మా.. మా ఆడపిల్లల ప్రాణాలు కాపాడండి. ఈ శిథిలావస్థ భవనం నుండి వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి, కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోండి" అని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను వేడుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైనా అపశృతి జరగకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి, తక్షణమే స్పందించాలని అందరూ ఆశిస్తున్నారు.




