Sullurupeta: సుళ్ళూరుపేటలో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు: కల్తీ నూనెలు సీజ్!

Sullurupeta: సుళ్ళూరుపేటలో వంట నూనె కల్తీ కలకలం! ఫిర్యాదు మేరకు లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్‌లో ఆహార భద్రతా అధికారి మద్దులేటి తనిఖీలు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 26 May 2026 8:21 PM IST
Sullurupeta
X

Sullurupeta: సుళ్ళూరుపేటలో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు: కల్తీ నూనెలు సీజ్!

తిరుపతి జిల్లా: ​సుళ్ళూరుపేట పట్టణంలో వంట నూనెల నాణ్యత మరియు నిత్యావసర ఆహార పదార్థాల కల్తీలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఆహార భద్రతా అధికారి మద్దులేటి సుళ్ళూరుపేటలో విస్తృత తనిఖీలు చేపట్టారు.​ఆహార భద్రతా అధికారి మద్దులేటి తెలిపిన వివరాల ప్రకారం.. గత పది రోజుల క్రితం స్థానిక హోటల్ నిర్వాహకులు ఒక దుకాణం నుండి 13 లీటర్ల సీలు చేసిన నూనె డబ్బాను కొనుగోలు చేశారు. అయితే ఆ నూనెను హోటల్‌లో వినియోగించిన సమయంలో నూనె రంగు మారడం, విపరీతంగా నురుగు రావడాన్ని గమనించిన నిర్వాహకులు, నాణ్యతపై అనుమానంతో ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నూనెను సుళ్ళూరుపేటలోని 'లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్' అనే హోల్‌సేల్ ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

​బాధిత హోటల్ యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారి మద్దులేటి, సదరు హోటల్‌లో వాడుతున్న నూనెతో పాటు లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ ఏజెన్సీలోని సీలు చేసిన డబ్బాల నుండి కూడా నూనె నమూనాలను సేకరించి, తదుపరి రసాయన పరీక్షల నిమిత్తం చెన్నైలోని ప్రయోగశాలకు పంపించినట్లు వెల్లడించారు. ప్రయోగశాల నుండి వచ్చే నివేదిక ఆధారంగా నూనె నాణ్యత లోపించినట్లు తేలితే జాయింట్ కలెక్టర్ కోర్టుకు కేసు బదిలీ చేస్తామని, ఒకవేళ ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు హాని కలిగించేలా ఉంటే కోర్టు ద్వారా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటళ్లు, ఫుట్‌పాత్ బండ్లు, బజ్జీల బండ్లు, కోడిమాంసం పకోడా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నల్లగా మారేంత వరకు ఒకే నూనెను పదే పదే వాడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఆహార పదార్థాలలో కృత్రిమ రంగులు, రుచి కోసం వాడే ఉప్పు వాడకాన్ని నిలిపివేయాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం పూట ఇడ్లీ వ్యాపారులు వేడి వేడి ఇడ్లీల తయారీ కోసం ప్లాస్టిక్ కవర్లను వాడటం పూర్తిగా నిషేధించామని, కేవలం తెల్లటి కాటన్ గుడ్డ మాత్రమే వాడాలని ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్లు వేడికి కరిగి సూక్ష్మ రూపంలో ఆహారంలో కలిసి శరీరంలోకి చేరడం వల్ల, దీర్ఘకాలంలో అవి క్యాన్సర్ కారకాలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

​సుళ్ళూరుపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీపై అనుమానం వస్తే నమ్మదగిన ఆధారాలు, కొనుగోలు బిల్లులతో తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, తప్పుడు ఫిర్యాదులు చేయవద్దని జిల్లా ఆహార భద్రతా అధికారి మద్దులేటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story