Sullurupeta: సూళ్ళూరుపేట వద్ద ఘోర ప్రమాదం: జిమ్ నిర్వాహకుడు దుర్మరణం!
Sullurupeta: సూళ్ళూరుపేట షార్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం. కంపెనీ బస్సు కారును ఢీకొనడంతో జిమ్ నిర్వాహకుడు మురళీ కృష్ణ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం.
Sullurupeta: సూళ్ళూరుపేట వద్ద ఘోర ప్రమాదం: జిమ్ నిర్వాహకుడు దుర్మరణం!
Sullurupeta: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జి.చెంచుబాబు ఆధ్వర్యంలో, సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీ కృష్ణ పర్యవేక్షణలో సూళ్ళూరుపేట ఎస్సై జి.అజయ్ కుమార్ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అజయ్ కుమార్ వివరాలు వెల్లడిస్తూ, సైదాపురం మండలం గ్రిద్దలూరు గ్రామానికి చెందిన కంభం రమణా రెడ్డి కుమారుడు కంభం మురళి కృష్ణ రెడ్డి (36) గత కొన్నేళ్ళుగా సూళ్ళూరుపేట టౌన్, పరమేశ్వరి నగర్లో నివాసముంటూ 'గోల్డెన్ జిమ్' నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇతనికి 6 ఏళ్ల క్రితం శ్రీవాణితో వివాహమై ఒక పాప ఉందని తెలిపారు.
01.11.2026 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో మురళి కృష్ణ రెడ్డి తన కారు (AP 26 CS 2124)లో షార్ Y-జంక్షన్ వైపు వెళ్తుండగా, షార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఎదురుగా కోళ్ళమిట్ట వైపు నుండి సూళ్ళూరుపేట టౌన్ వైపు వస్తున్న కంపెనీ బస్సు (AP 39 WB 0142) డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి కారును బలంగా ఢీకొట్టాడని, ఈ ప్రమాదంలో మురళి కృష్ణ రెడ్డి కారులోనే ఇరుక్కుపోయి తలకు, ఒంటిపై బలమైన తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడని పేర్కొన్నారు.
ఈ ప్రమాద తీవ్రతపై ఎస్సై అజయ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఇళ్ల వద్ద తమ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల నిండు ప్రాణాలు బలవడమే కాకుండా కుటుంబాలు వీధిన పడతాయని, కావున ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.




