Tirupati: డివిఎమ్‌సి రివ్యూలో అధికారులకు ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలు
Tirupati: తిరుపతి కలెక్టరేట్‌లో DVMC సమావేశంలో పాల్గొన్న సూళ్ళూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ. ఇళ్ల పట్టాలు, అంబేద్కర్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ సమస్యలపై కీలక ఆదేశాలు.
Tirupati: డివిఎమ్‌సి రివ్యూలో అధికారులకు ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలు
తిరుపతి: తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (DVMC) సమావేశంలో సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని, నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రధాన అంశాలపై ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన దిశానిదేశం చేశారు. సూళ్ళూరుపేట పరిధిలోని యర్రబాలెంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలాలు సిద్ధంగా ఉన్నందున తక్షణమే పనులు ప్రారంభించాలని, దొరవారిసత్రం మండలం ఎకొల్లులో పెండింగ్‌లో ఉన్న అనుమతులు వెంటనే మంజూరు చేయించాలని అధికారులను కోరారు.
అలాగే ఓజిలి, తడ మండలాల్లో భవన నిర్మాణాలకు స్థలాల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, పెళ్లకూరులో భూసేకరణ ద్వారా స్థలం కేటాయించాలని ఆదేశించారు.
పేదల ఇళ్ల పట్టాల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. సూళ్ళూరుపేట నేర్రికాలువ కట్టపై నివాసముంటున్న 70 కుటుంబాలకు మన్నారుపోలూరు లేఔట్‌లో వెంటనే ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. దొరవారిసత్రం మండలం తనయాలి, వరదయ్యపాలెం, బి.ఎన్. కండ్రిగ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ 6-స్టెప్ వాలిడేషన్ ప్రక్రియను పూర్తి చేసి త్వరగా ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరారు.
వరద ముంపు నివారణ చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. బురదమడుగు ఎస్సీ కాలనీ రక్షణ కోసం కాళంగి నది కట్టలను బలోపేతం చేయడంతో పాటు ఇరిగేషన్ నిధులు మంజూరు చేయించాలన్నారు. గోపాల్‌రెడ్డి పాలెంలో తుంగల చెరువు కారణంగా పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందించి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
సాగు భూముల సమస్యలపై స్పందిస్తూ, పెళ్లకూరు మండలం రోసనూరులోని 80 గిరిజన కుటుంబాలకు రెవెన్యూ, అటవీ శాఖల ఉమ్మడి పరిశీలన పూర్తి చేసి డీకేటీ పట్టాలు అందించాలని కోరారు. అదేవిధంగా బంగారంపేట, వేణుంబాక ప్రాంతాల్లోని పేద రైతుల సాగు భూములను క్రమబద్ధీకరించాలని సూచించారు. నియోజకవర్గంలో స్మశాన వాటికలు లేని ఎస్సీ, ఎస్టీ కాలనీలను గుర్తించి, ప్రభుత్వ భూమిని కేటాయించడం ద్వారా లేదా భూసేకరణ ద్వారా వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వేగంగా చేరవేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు.




