Sullurupeta: సూళ్లూరుపేట పాఠశాలల్లో ఎస్సై అజయ్ కుమార్ అవగాహన సదస్సు
Sullurupeta: సూళ్లూరుపేట జడ్పీ హైస్కూల్, కోటపోలూరు పాఠశాలల్లో ఎస్సై జి. అజయ్ కుమార్ విద్యార్థులకు సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.
Sullurupeta: సూళ్లూరుపేట పాఠశాలల్లో ఎస్సై అజయ్ కుమార్ అవగాహన సదస్సు
తిరుపతి జిల్లా: సూళ్ళూరుపేటలోని స్థానిక జడ్పీ హైస్కూల్ మరియు కోటపోలూరు ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన పాఠశాల కమిటీ ఛైర్మన్ ఎన్నికల పర్యవేక్షణ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూళ్ళూరుపేట సబ్ ఇన్‌స్పెక్టర్ జి.అజయ్ కుమార్ అందించిన మార్గదర్శనం ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచింది.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జి.చెంచుబాబు ఆధ్వర్యంలో, సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ నేరుగా పర్యవేక్షించగా, ఎస్సై జి.అజయ్ కుమార్ ఈ పర్యటనలో ముఖ్య పాత్ర పోషించారు.
పాఠశాలలకు విచ్చేసిన సందర్భంగా ఎన్నికల ప్రక్రియ సుఫీలంగా జరిగేలా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై, అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.
విద్యార్థులు సమాజంలో నేరాల పట్ల మరియు సామాజిక బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరిస్తూ ఆయన అత్యంత ఆకట్టుకునే రీతిలో సందేశాన్ని అందించారు. వర్తమాన సమాజంలో ఎదురవుతున్న పలు సవాళ్లపై సమగ్రమైన అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, బాలల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు.
నేటి డిజిటల్ యుగంలో తీవ్రరూపం దాల్చుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సులభ శైలిలో మార్గదర్శనం చేశారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడం వల్ల ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవచ్చో సూచించారు.
యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా వివరిస్తూ, వాటికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. ఎస్సై అజయ్ కుమార్ విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ అందించిన హితబోధ, వారిలో నైతిక విలువలను మరియు చట్టంపై గౌరవాన్ని పెంచేలా ఎంతో ఆకట్టుకుంది. నేర రహిత సమాజ స్థాపనలో విద్యార్థుల పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు.




