Sullurupeta: ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి!
Sullurupeta: సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు పాటించాలని వ్యయ పరిశీలకులు కె. మహబూబ్ భాషా ఆదేశం. చైర్‌పర్సన్‌కు ₹20 లక్షలు, వార్డు మెంబర్‌కు ₹7.5 లక్షల పరిమితి.
Sullurupeta: ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి!
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, వ్యయ పర్యవేక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని ఎన్నికల వ్యయ పరిశీలకులు కె.మహబూబ్ భాషా స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిజిల్లా సూళ్ళూరుపేటలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, సమీక్షా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతాలను తనిఖీ చేయడంతో పాటు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTs), ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTs) పనితీరు, పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. వ్యయ పర్యవేక్షణ బృందాలు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్‌కు ముందు, పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.
అభ్యర్థులు ఎన్నికల వ్యయ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహిస్తూ రోజువారీ ఖర్చుల వివరాలను అకౌంటింగ్ బృందాలకు సమర్పించాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాలని, నిబంధనల ప్రకారం ₹2,000 కంటే తక్కువ మొత్తాలను మాత్రమే నగదు రూపంలో చెల్లించి, ₹2,000 దాటిన చెల్లింపులన్నింటినీ బ్యాంక్ బదిలీ ద్వారానే జరపాలని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థులు ₹20 లక్షలు, వార్డు మెంబర్లు ₹7.5 లక్షల వ్యయ పరిమితి దాటకూడదని తెలిపారు.
అనంతరం సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ పరంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, అక్రమ నగదు రవాణాపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎన్నికల సంఘం సూచించిన అన్ని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో తిరుపతి నోడల్ అధికారి వై.మధు కిరణ్ రెడ్డి, సహాయక వ్యయ పరిశీలకులు కె.సాగర్ బాబు, టీమ్ సభ్యులు అనిల్ కుమార్, సునంద్, శ్రీకాంత్, సూళ్ళూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, పోలీసు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




