Sullurupeta: ఓట్ల లెక్కింపు రద్దీ: గేటు దాటలేక విద్యార్థినుల అవస్థలు!

Sullurupeta: సూళ్ళూరుపేటలో ఓట్ల లెక్కింపు వేళ జనం రద్దీతో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఇబ్బంది పడగా, సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 7 Nov 2026 5:24 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఓట్ల లెక్కింపు రద్దీ: గేటు దాటలేక విద్యార్థినుల అవస్థలు!

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద చోటుచేసుకున్న జనసందోహం, సంబరాల హోరు కారణంగా స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్కూల్ ముగిసే సమయానికి బయటకు రాలేని దయనీయ పరిస్థితి ఏర్పడగా.. పోలీసులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు.

​సూళ్ళూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. ఈ నేపథ్యంలో కళాశాల మెయిన్ గేట్ వద్ద వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా జనసమద్దూ పెరిగి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

​అదే సమయంలో జూనియర్ కళాశాలకు ఆనుకుని ఉన్న జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ముగిసింది. అయితే, గేటు బయట వేలాది మంది జనం, వాహనాలు నిలిచిపోవడంతో చిన్నారి విద్యార్థినులు బయటకు వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఒకవైపు ట్రాఫిక్ స్తంభించడం, మరోవైపు కార్యకర్తల కోలాహలం మధ్య విద్యార్థినులు రోడ్డు దాటలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు..

ఈ సమాచారం తెలుసుకున్న సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూళ్ళూరుపేట ఎస్సై జి.అజయ్ కుమార్, తడ ఎస్సై కొండప్పనాయుడు లతో కూడిన పోలీస్ బృందం అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.

రోడ్డుపై నిలిచిన వాహనాలను, గుమిగూడిన జనాలను పక్కకు పంపి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పాఠశాల విద్యార్థినులు ఎటువంటి ఇబ్బందికి గురికాకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేసి మార్గాన్ని సుగమం చేశారు. తక్షణమే స్పందించి విద్యార్థినుల కష్టాలు తీర్చిన పోలీసుల తీరుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta