Tirupati: భూమనా కరుణాకర్ రెడ్డికి టిడిపి నేత జేబీ శ్రీనివాస్ హెచ్చరిక!
Tirupati: కలెక్టర్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నేత జే.బీ. శ్రీనివాస్. తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని భూమనాపై మండిపాటు.
Tirupati: భూమనా కరుణాకర్ రెడ్డికి టిడిపి నేత జేబీ శ్రీనివాస్ హెచ్చరిక!
Tirupati: తిరుపతి వేదికగా వైకాపా నేత భూమనా కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి లపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ జే.బి.శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ల పై భూమనా తండ్రీకొడుకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్, ఇకపై తమ సహనానికి పరీక్ష పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో జే.బి.శ్రీనివాస్ మాట్లాడుతూ, హాస్టల్లో కష్టపడి చదువుకుని బీసీ కుటుంబం నుంచి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన జిల్లా కలెక్టర్‌ను "డాకు మంగళ్ సింగ్" అని సంబోధించడం కరుణాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పడుతోందన్నారు. వెయ్యిమంది చార్లెస్ శోభరాజ్‌లు కలిస్తే కరుణాకర్ రెడ్డి అని, వందమంది డాకు మంగళ్ సింగ్‌లు కలిస్తే అభినయ్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
రేపల్లె నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనగాని సత్యప్రసాద్‌కు గొప్ప కుటుంబ నేపథ్యం ఉంటే, కరుణాకర్ రెడ్డి మాత్రం గతంలో సుగుణమ్మపై కేవలం 700 ఓట్ల తేడాతో దొంగతనంగా గెలిచారని ఎద్దేవా చేశారు.
తిరుపతిలో భూ అక్రమాలు, టీటీడీ ఆస్తుల దోపిడీకి కరుణాకర్ రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా మారారని జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. తనపల్లిలో 15 ఎకరాలు, వడమాలపేటలో 2 ఎకరాలు, ఏసుపురంలో 10 ఎకరాల భూములతో పాటు పరకామణి దొంగతనాలకు పాల్పడ్డారని విమర్శించారు.
కొండపై తొలిసారి చైర్మన్ అయిన సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్లాస్మా టీవీలు భూమనా ఇంట్లో ఎందుకు ఉన్నాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. నగరం అంతటా గంజాయి, గుట్కా మాఫియాను ప్రోత్సహించిన భూమనాపై 300 సినిమాలు తీయవచ్చని ఎద్దేవా చేశారు.
ఇక తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా యత్నిస్తోందని, యాదవులను అసభ్యంగా దూషిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. తాను చిన్నప్పటి నుంచి పెద్దకాపు వీధిలోని యాదవ సోదరులతో ఒకే కుటుంబంలా పెరిగానని, తాను ఎవరినీ దూషించలేదని ఒకవేళ నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
పేటియం బ్యాచ్‌ను నమ్ముకుని కరుణాకర్ రెడ్డి ఎంతో మంది జీవితాలను ముంచేశారని, వాటన్నింటినీ త్వరలోనే చట్టపరంగా బయటపెడతామని పేర్కొన్నారు. "దండుపాళ్యం బ్యాచ్ ఇకపై జాగ్రత్తగా ఉండాలి, నోటికి ఏది వస్తే అది వాగితే ఊరుకునేది లేదు, త్వరలోనే మీ పొగరు దించుతాం" అంటూ జే.బి.శ్రీనివాస్ భూమనా కరుణాకర్ రెడ్డికి చివరి హెచ్చరిక జారీ చేశారు.




