Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు సింహ వాహనంపై యోగ నరసింహుడిగా శ్రీవారు!

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 14 Oct 2026 11:28 AM IST
Tirumala
X

Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు సింహ వాహనంపై యోగ నరసింహుడిగా శ్రీవారు!

Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. ధైర్యం, పరాక్రమం, తేజస్సుకు ప్రతీకగా భావించే సింహ వాహనంపై స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సింహ వాహనంపై విరాజిల్లుతున్న శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించేందుకు తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వాహనసేవ ప్రారంభానికి ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా... భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ ఈ వేడుక అత్యంత భక్తిశ్రద్ధలతో, కనులపండువగా సాగింది. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగానే స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సింహం పరాక్రమం, ధైర్యం, ఆధిపత్యం మరియు మహాశక్తికి ప్రతీక. సింహరూప దర్శనం భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, విజయస్ఫూర్తిని మేల్కొలుపుతుందని, సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు ఈ సేవ స్ఫూర్తినిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు అభయం, ధైర్యం, అపారమైన ఆధ్యాత్మిక శక్తి చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ దివ్య వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.