Tirumala: తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్స్ దళారీల అరెస్ట్

Tirumala: నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ ఫొటోలతో తిరుమలలో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు దళారీలను అరెస్ట్ చేసిన పోలీసులు, విజిలెన్స్.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 8 Aug 2026 10:24 PM IST
Tirumala
X

Tirumala: తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్స్ దళారీల అరెస్ట్

తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురిని పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు గుర్తించారు.

అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే తిరుమల PAC-5 వద్ద ఛార్జింగ్‌కు ఉంచిన భక్తుల సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో *బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)*లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాల తయారీకి ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న PAC-5 వద్ద చోరీకి గురైన రెండు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు రికవరీ చేశారు. నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

దళారీలను నమ్మొద్దు:

తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు భక్తులకు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. నకిలీ ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలతో గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే 112కు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలియజేయాలని కోరారు.

భక్తుల భద్రత, సౌకర్యం, తిరుమలలో పారదర్శకమైన సేవల పరిరక్షణ కోసం పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో రూమ్ దళారీలపై నిరంతర నిఘా కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story