Tirumala: సీఎం చంద్రబాబు సమక్షంలో విరాళం అందించిన చెన్నై జైన్ దంపతులు!

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలు విరాళంగా సమర్పించారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 26 Nov 2026 3:28 PM IST
Tirumala
X

Tirumala: సీఎం చంద్రబాబు సమక్షంలో విరాళం అందించిన చెన్నై జైన్ దంపతులు!

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన జైన్ దంపతులు వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు సుమారు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఆభరణాలను టీటీడీ అర్చకులు, ప్రతినిధులకు అందజేశారు. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వజ్రాలు కూడా ఈ కానుకలో ఉన్నాయి. తిరుమలలో జరిగిన ఈ అపూర్వ ఘట్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.

అనంతరం వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీవారికి ఇంతటి భారీ విరాళాన్ని అందించిన జైన్ దంపతులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక అని.. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో మరెక్కడా లభించని దివ్యానుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. 121 కిలోల బంగారాన్ని దేవుడి ఆదేశంతో విరాళంగా అందిస్తున్నామని జైన్ దంపతులు చెప్పడం విశేషమన్నారు. ఈ అపూర్వ ఘట్టంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

శ్రీవారిపై భక్తులకు ఉన్న విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొక్కులు చెల్లించుకునే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి నిలువుదోపిడీ సమర్పిస్తారని గుర్తుచేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నేటి వరకు శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూరు, మరాఠా రాజులు తిరుమల ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని వివరించారు.

విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి అనేక విలువైన ఆభరణాలను సమర్పించారని, ఆయన అందించిన రత్నకిరీటం, పీతాంబరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్వకాలంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగినప్పటికీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం విషయంలో ఎవరూ అలాంటి సాహసానికి ఒడిగట్టలేదన్నారు. శ్రీవారి వైభవాన్ని, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు ఎంతోమంది కృషి చేశారని తెలిపారు. భక్తుల అపార విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన జైన్ దంపతుల విరాళం తిరుమల చరిత్రలో మరో విశేష ఘట్టంగా నిలిచిపోనుంది.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.