Tirupati: పర్మిట్ లేని వాహనాలపై సెక్షన్ 192A కింద చర్యలు
Tirupati: తిరుపతి జిల్లాలో పర్మిట్ లేకుండా ఆటోలు, క్యాబ్‌లు నడిపితే రూ.10,000 జరిమానా, సెక్షన్ 192A కింద చర్యలు తప్పవని డీటీఓ కొర్రపాటి మురళీ మోహన్ హెచ్చరిక.
Tirupati: పర్మిట్ లేని వాహనాలపై సెక్షన్ 192A కింద చర్యలు
తిరుపతి: తిరుపతి జిల్లాలో పలువురు వాహన యజమానులు ఆన్‌లైన్ ద్వారా తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ, సంబంధిత రవాణా పర్మిట్లు పొందకుండా వాహనాలను నడుపుతున్నట్లు రవాణా శాఖ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా మోటార్ కాబ్స్ మరియు ఆటోరిక్షా వాహనాల యజమానులు విధిగా పర్మిట్ విషయంపై దృష్టి సారించవలసిందని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ తెలియజేశారు.
వాహనాన్ని ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మాత్రమే కాకుండా సంబంధిత వాహన తరగతికి వర్తించే నిబంధనల ప్రకారం తప్పనిసరిగా పర్మిట్ పొందాలి. పర్మిట్ లేకుండా రవాణా వాహనాలను నడపడం చట్టవిరుద్ధం. పర్మిట్ లేకుండా వాహనాలను నడిపే వారిపై మోటారు వాహన చట్టం, 1988 లోని సెక్షన్ 192A కింద కేసులు నమోదు చేసి, రూ.10,000 వరకు జరిమానా విధించడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అంతేకాకుండా, పర్మిట్ లేకుండా లేదా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వాహనాన్ని నడిపే సమయంలో ప్రమాదం సంభవిస్తే, బీమా క్లెయిమ్ విషయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది వాహన యజమానులకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు. వాహన యజమానుల సౌకర్యార్థం సంబంధిత పర్మిట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిర్ణీత ప్రభుత్వ ఫీజులు చెల్లించి, వర్తించే నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల వరకు పర్మిట్ పొందవచ్చు.
కావున, ఇప్పటివరకు పర్మిట్లు పొందని ఆటోరిక్షాలు మరియు ఇతర ప్రయాణికుల వాహనాల యజమానులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా తక్షణమే పర్మిట్లు పొందాలని సూచించడమైనది. తిరుపతి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, పర్మిట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాహన యజమానులు రవాణా నిబంధనలు పాటించి, తమ వాహనాలకు అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతే రహదారులపై నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి.




