Renigunta: అమరా హాస్పిటల్‌లో 'అడ్వాన్స్‌డ్ ట్రామా సర్వీసెస్' ప్రారంభం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట అమరా హాస్పిటల్‌లో గోల్డెన్ అవర్ లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ట్రామా సర్వీసెస్ (ATS)ను ప్రారంభించారు.
Renigunta: అమరా హాస్పిటల్‌లో 'అడ్వాన్స్‌డ్ ట్రామా సర్వీసెస్' ప్రారంభం!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని అమరా హాస్పిటల్‌లో అత్యాధునిక అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ‘గోల్డెన్ అవర్’ లోనే చికిత్స అందించడమే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ట్రామా సర్వీసెస్ (ATS)ను ప్రారంభించారు.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఫోన్ చేసిన వెంటనే వారి లొకేషన్ ఆధారంగా తగిన అంబులెన్స్‌ను పంపడంతో పాటు,ఆసుపత్రికి తరలించే మార్గంలోనే ప్రాథమిక చికిత్స అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగం,ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను ముందస్తుగా సిద్ధం చేసి రోగి చేరుకున్న వెంటనే చికిత్స ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు.
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, తీవ్రమైన రక్తస్రావం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకమని చైర్మన్ గౌరినేని ప్రసాద్ తెలిపారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే భారత్‌లో అత్యవసర కేసుల్లో మరణాల రేటు అధికంగా ఉందని పేర్కొన్నారు. అత్యవసర వైద్యం కోసం చెన్నై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాయలసీమ ప్రాంతంలోనే అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించడమే ATS లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా అమరా హాస్పిటల్‌లో నూతన గ్యాస్ట్రోఎంటరాలజీ,
డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. అలాగే ‘హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్’ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,మాజీ మంత్రి గల్లా అరుణకుమారి,అమర రాజా ఎండీ గల్లా రామచంద్ర నాయుడు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,
డీఎంహెవో బాలకృష్ణ నాయక్,ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఆర్టీఓ మురళీమోహన్ తదితరులు హాజరయ్యారు. ఆసుపత్రి యాజమాన్యం,వైద్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాయలసీమలో అత్యవసర వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థలను ప్రోత్సహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.




