Tirupati: తిరుపతి పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Tirupati: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తిరుపతి పోలీసులకు జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఫిర్యాదు. కఠిన చర్యలకు డిమాండ్.
Tirupati: తిరుపతి పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తిరుపతి: ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన "పేటీఎం బ్యాచ్"పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ, అభిమానుల తాకిడిలో గాయపడిన పవన్ కళ్యాణ్ భుజానికి తీవ్ర గాయం కావడంతో ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. కుడి భుజానికి ఆపరేషన్ జరిగితే, ఎడమ చేతికి ఆపరేషన్ చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ఉపముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నాయకుడిపై ఇలాంటి అవమానకర పోస్టులు చేయడం బాధాకరమని అన్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోడికత్తి ఘటనలో గాయపడినప్పుడు రాజకీయ విభేదాలు పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారని గుర్తు చేశారు. రాజకీయ ప్రత్యర్థులైనా కష్టకాలంలో మానవత్వంతో స్పందించడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పారు.
ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునే మనస్తత్వం పవన్ కళ్యాణ్‌కు ఉందని, అలాంటి నాయకుడు ఆరోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనపై ట్రోల్స్ చేయడం అభిమానుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబును ఉద్దేశించి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాగార్జున యాదవ్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారం, ట్రోల్స్ చేస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.




