Tirupati: తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ కౌంటింగ్!

Tirupati: తిరుపతి జిల్లాలోని ఐదు పురపాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 Nov 2026 1:12 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ కౌంటింగ్!

Tirupati: తిరుపతి జిల్లాలోని నాలుగు పురపాలక సంస్థలు సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, వెంకటగిరితో పాటు తిరుపతి నగరపాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

మంగళవారం. ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూములను తెరిచి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు అన్ని కేంద్రాల్లో మేయర్/చైర్‌పర్సన్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల వర్గీకరణ (సెగ్రిగేషన్) ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.

తిరుపతి నగరపాలక సంస్థ మినహా మిగిలిన నాలుగు పురపాలక సంస్థల్లో వార్డుల వారీగా ఓట్ల లెక్కింపుతో పాటు మేయర్/చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా వివిధ రౌండ్లలో కొనసాగుతోందని తెలిపారు. వెంకటగిరి, పుత్తూరు పురపాలక సంస్థల ఫలితాలు మరో గంటలోపు పూర్తిస్థాయిలో వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంస్థల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తయ్యే అవకాశం ఉందని, తిరుపతి నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 7 గంటలలోపు పూర్తవుతుందన్నారు.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయిందని, తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఎన్నికల నిర్వహణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తోందని తెలిపావు. చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగిందని, చోటుచేసుకున్న సంఘటనలపై కూడా కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో స్వయంగా మాట్లాడి కౌంటింగ్ ప్రక్రియ తీరును తెలుసుకున్నానని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లు వారు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై అభ్యర్థులు, ఏజెంట్లు సంతృప్తి వ్యక్తం చేసారన్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, అసిస్టెంట్ కమీషనర్ శారదా దేవి, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డిప్యూటీ కమీషనర్ అమరయ్య, తిరుపతి అర్బన్ తహసీల్దార్. సురేష్ బాబు ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL