Tirupati: తిరుపతి జంట హత్యల కేసు క్లోజ్: ముగ్గురు నిందితుల అరెస్ట్!

Tirupati: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో మునిరత్నం, మణికంఠలను హత్య చేసిన ముగ్గురు నిందితులను ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తి, బైక్ స్వాధీనం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 July 2026 10:35 AM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జంట హత్యల కేసు క్లోజ్: ముగ్గురు నిందితుల అరెస్ట్!

Tirupati: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 8వ తేదీ రాత్రి తిరుమలలో వ్యాపారం చేస్తున్న మునిరత్నం @ ముని యాదవ్ మరియు అతని స్నేహితుడు కె. మణికంఠ కుటుంబ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వం కోసం పద్మావతి కళ్యాణ మండపానికి వెళ్లారు.అక్కడ వాగ్వాదం అనంతరం తిరిగి వస్తుండగా నిందితులు మోటార్ సైకిల్‌పై వచ్చి వారిని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా,తీవ్రంగా గాయపడిన మణికంఠ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (లా అండ్ ఆర్డర్), తిరుపతి ఎస్డీపీవో పర్యవేక్షణలో ఈస్ట్ సీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నైనార్ వాసుదేవయ్య (59), నైనార్ సునీల్ (32), నైనార్ ఉపేంద్ర (30)లను జూలై 10న మధ్యాహ్నం ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణమ్మ ఆలయం సమీపంలో అరెస్ట్ చేశారు. నిందితులు జంగాలపల్లి నుంచి తిరుపతికి వచ్చి, అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల ఒప్పుకోలు మేరకు హత్యకు ఉపయోగించిన కత్తి, నేరం జరిగిన సమయంలో ధరించిన దుస్తులు, ఏపీ 03 సీజీ 1689 నంబర్ గల మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story