Tirupati: MBU మరియు 'యంగ్ ఇండియన్స్' మధ్య కీలక అవగాహన ఒప్పందం!
Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయం, సీఐఐ యంగ్ ఇండియన్స్ మధ్య విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
Tirupati: MBU మరియు 'యంగ్ ఇండియన్స్' మధ్య కీలక అవగాహన ఒప్పందం!
Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన 'యంగ్ ఇండియన్స్' ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రగిరి మండలం, ఏ. రంగంపేట సమీపంలోని శ్రీ సాయినాథ్ నగర్ ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంబియు వైస్ ఛాన్సలర్ పివి రమణ గారు, రిజిస్ట్రార్ సారథి గారు, డీన్ డాక్టర్ S. బాబు దేవసేనాపతిలు యంగ్ ఇండియన్స్ తిరుపతి ఛాప్టర్ ప్రతినిధులు డి. నితిన్, యంగ్ ఇండియన్స్ తిరుపతి ఛైర్ హర్షద్ బాషాలు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ గారు మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు వారిలోని నాయకత్వ పటిమను, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. యువతలో సామాజిక స్పృహను పెంపొందించడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా ప్రతి ఏటా విద్యార్థులను 'యువ' వేదికలో భాగస్వాములను చేయనున్నారు. విద్యార్థులు స్వయంగా వినూత్న ప్రాజెక్టులను రూపకల్పన చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జాతీయ, ప్రాంతీయ స్థాయి సదస్సులలో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సిఐఐ రీజినల్ డైరెక్టర్ దేవ్ జ్యోతి, ఎంబియు ఫైనాన్స్ డైరెక్టర్ రవిశేఖర్ గారు, యంగ్ ఇండియన్స్ తిరుపతి బ్రాండింగ్ ఛైర్ తౌఫీక్ అహ్మద్, యంగ్ ఇండియన్స్ తిరుపతి లెర్నింగ్ ఛైర్ శ్రీఖర్ లతో పాటు సిఐఐ ఎంబియు డీన్ డాక్టర్ S. బాబు దేవసేనాపతి, రిజిస్ట్రార్ డాక్టర్ సారధి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




