Tirupati: పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో పోలీసుల అవగాహన కార్యక్రమాలు
Tirupati: తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో గ్రామాల్లో పోలీసుల అవగాహన; డయల్ 112కు సూచన.
Tirupati: పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో పోలీసుల అవగాహన కార్యక్రమాలు
తిరుపతి: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, పోలీస్ శాఖ తీసుకుంటున్న భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, రాజకీయ విభేదాలు, వ్యక్తిగత కక్షలతో గొడవలకు దిగడం, ప్రత్యర్థులను బెదిరించడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బలవంతంగా ఓట్లు వేయించుకోవడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.
అలాగే, ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన వార్తలు, వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, బెదిరింపులు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరుతున్నారు.
ప్రజలందరి సహకారంతో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.




