Railway Koduru: విద్యార్థినులు ధైర్యంగా, స్వేచ్ఛగా చదువుకోవాలి: డీఈఓ కుమార్!

Railway Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల భద్రత, స్వీయ రక్షణ కరాటేపై డీఈఓ కె.వి.ఎన్. కుమార్, సీఐ శంకర్ ప్రత్యేక అవగాహన కల్పించారు.

PRASAD, KODURU
Published on: 21 Nov 2026 1:03 PM IST
Railway Koduru
X

Railway Koduru: విద్యార్థినులు ధైర్యంగా, స్వేచ్ఛగా చదువుకోవాలి: డీఈఓ కుమార్!

కోడూరు: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి భద్రత, విద్య, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు.

విద్యార్థినులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ధైర్యంగా, స్వేచ్ఛగా చదువుకోవాలని డీఈఓ సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం విద్యార్థినుల స్వీయ రక్షణ కోసం అందిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో తనను తాను రక్షించుకునే నైపుణ్యాలను అలవర్చుకోవాలని డీఈఓ పిలుపునిచ్చారు. కరాటే వంటి స్వీయ రక్షణ విద్య కేవలం శారీరక రక్షణకే కాకుండా ధైర్యం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థినులను ఎవరైనా ఫోన్ ద్వారా వేధించినా, వెంబడించినా, అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని, చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి, మంచి నడవడికతో, క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రత, సంక్షేమం పోలీస్ శాఖ బాధ్యత అని తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసుల నిఘా ఏర్పాటు చేస్తామని, విద్యార్థినుల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలికలు ఎలాంటి భయం లేకుండా తమ చదువుపై దృష్టి సారించాలని, సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

విద్యార్థినుల పట్ల జరుగుతున్న వేధింపుల సమస్యను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా గుర్తించి, సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

PRASAD, KODURU

PRASAD, KODURU