Sullurpeta: సూళ్ళూరుపేటలో ప్రశాంతంగా ఎన్నికలు: 74.36% పోలింగ్ నమోదు!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలో 74.36 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 7న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ జరగనుండగా, 144 సెక్షన్ అమలు చేశారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 5 Nov 2026 11:38 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేటలో ప్రశాంతంగా ఎన్నికలు: 74.36% పోలింగ్ నమోదు!

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలో 2026 ఎంపిటిసి, జెడ్పిటిసి పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. సూళ్ళూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాల పరిధిలోని మొత్తం 32 సెగ్మెంట్లలో 88,175 మంది ఓటర్లకు గానూ 65,574 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో సగటున 74.36 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ​

మండలాల వారీగా పరిశీలిస్తే. తడ మండలంలోని 13 సెగ్మెంట్లలో 35,537 ఓటర్లకు 26,924 ఓట్లు పోలై అత్యధికంగా 75.80 శాతం పోలింగ్ నమోదైంది. సూళ్ళూరుపేట మండలంలోని 9 సెగ్మెంట్లలో 24,214 ఓటర్లకు 17,999 ఓట్లు పోలై 74.39 శాతం నమోదు కాగా, దొరవారిసత్రం మండలంలోని 10 సెగ్మెంట్లలో 28,424 ఓటర్లకు గానూ 20,651 ఓట్లు పోలై 72.65 శాతం పోలింగ్ నమోదైంది.

​శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంటూ సహకరించిన సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కట్టుదిట్టం:

ఈ మూడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 7వ తేదీన సూళ్ళూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. కౌంటింగ్ దృష్ట్యా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డీజేలు, బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న ప్రతినిధులను మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta