Tirupati: స్విమ్స్ కార్మికుల పోరాటం 82వ రోజుకు.. మే 22 నుండి నిరవధిక దీక్షలు!

Tirupati: తిరుపతి స్విమ్స్ (SVIMS) ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన పోరాటం 82వ రోజుకు చేరింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 19 May 2026 6:02 PM IST
Tirupati
X

Tirupati: స్విమ్స్ కార్మికుల పోరాటం 82వ రోజుకు.. మే 22 నుండి నిరవధిక దీక్షలు!

Tirupati: స్విమ్స్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పోరాటం నేటికి 82వ రోజుకు చేరుకున్నప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో ఈ నెల 22వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్విమ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇందులో భాగంగా నేడు స్విమ్స్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద నిరవధిక నిరాహార దీక్షలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి స్విమ్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే వేణుగోపాల్,

యూనియన్ కార్యదర్శి జి. రవి మాట్లాడుతూ, స్విమ్స్‌లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను ‘వార్డు బాయ్’ విధుల్లో నియమించుకున్నప్పటికీ, వారికి తగిన హోదా,వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.శానిటేషన్ పేరుతో కార్మికులను తక్కువ వేతనాలతో పనిచేయించడం తీవ్ర అన్యాయమని, కార్మిక శాఖ సమక్షంలో ఇచ్చిన హామీలను అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

గత 82 రోజులుగా మండుటెండల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా, చర్చలు జరిపినా సమస్య పరిష్కారం దిశగా చర్యలు లేకపోవడం విచారకరమని తెలిపారు.

స్విమ్స్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, శానిటేషన్ హోదాను రద్దు చేసి ‘వార్డు బాయ్’ హోదా కల్పించడంతో పాటు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 22 నుంచి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వి సూరి, మారి ముత్తు, కోటయ్య, మునికృష్ణ, మునేంద్ర తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story