Tirupati: మహిమాన్విత క్షేత్రం రుద్రపాదాల ముక్కోటి: బ్రహ్మశ్రీ చాగంటి!

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం వైభవంగా జరిగింది.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 28 Nov 2026 7:46 AM IST
Tirupati
X

Tirupati: మహిమాన్విత క్షేత్రం రుద్రపాదాల ముక్కోటి: బ్రహ్మశ్రీ చాగంటి!

తిరుపతి: తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం తొండవాడ వద్ద స్వర్ణముఖీ నది ఒడ్డున వెలసిన శ్రీఅగస్త్యేశ్వర స్వామి మహా క్షేత్ర వైశిష్ట్యం, అగస్త్యమహర్షి ఆధ్యాత్మిక వైభవం, హరిహరుల అభేదతత్వం గురించి చాగంటి కోటేశ్వర రావు అద్భుతంగా వివరించారు. రుద్రపాదాల ముక్కోటి క్షేత్రంగా ప్రాచుర్యం పొందిన శ్రీఅగస్త్యేశ్వర స్వామి క్షేత్ర మహిమా తత్వాన్ని తెలుసుకునే అవకాశం లభించడంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు.

అగస్త్య మహాముని ఎక్కడ ఉంటే అక్కడికే ముక్కోటి దేవతలు విచ్చేసి ఉపాసన చేస్తారంటూ ఈ ఆలయం అంత పవిత్రమైనదని భక్తులకు ఉపదేశం చేశారు. దీంతో శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయన్న ప్రగాడ విశ్వాసం ఉండగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంతో ముక్కోటి క్షేత్ర ప్రాశస్త్యం భక్తులకు మరింత చేరువైంది. ]

గతంలో తాను ముక్కోటి క్షేత్రాన్ని అనేక సార్లు సందర్శించానని, నాటితో పోల్చితే ప్రస్తుతం ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని ఆలయ ధర్మకర్తల మండలిని ప్రశంసించారు. ధర్మబధ్ధమైన జీవితాన్ని గడపాలన్న ఆధ్యాత్మిక సందేశాలను భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తూ చాగంటి ప్రవచనం ఆద్యంతం ఆద్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

ముక్కోటి క్షేత్రం పులకించింది. భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రవచనకార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు మునుపు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మొగిలి ఇందుమౌళి రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీఅగస్త్యేస్వర స్వామి, శ్రీ ఆనందవళ్లీ దేవి అమ్మవార్లను, శ్రీహరిహరాదుల దివ్య మండపాన్ని, శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాద ముద్రను తన జీవిత భాగస్వామితో కలిసి దర్శించుకున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI