Sullurupeta: పార్కింగ్ లేని మాల్‌కు అనుమతులు ఎలా ఇచ్చారు?
Sullurupeta: ఆర్డీవో కార్యాలయం, ఫైర్ స్టేషన్‌కు వెళ్లే ఇరుకు రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Sullurupeta: పార్కింగ్ లేని మాల్‌కు అనుమతులు ఎలా ఇచ్చారు?
సూళ్ళూరుపేట: పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రహదారులపై వాహనాల రద్దీతో ప్రజలు సతమతమవుతుండగా, తాజాగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం మరియు ఫైర్ స్టేషన్‌కు వెళ్లే అత్యంత ఇరుకు మార్గంలో భారీ బట్టల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవ్వడం స్థానికుల్లో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీస్తోంది.
ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే ప్రధాన దారి ఇది. ఏదైనా అత్యవసర సమయంలో ఫైర్ ఇంజన్లు సెకన్ల వ్యవధిలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఇంత ఇరుకు రోడ్డులో భారీ షాపింగ్ మాల్ ఏర్పాటుకు అనుమతులివ్వడమే కాకుండా, సర్వీస్ రోడ్డును కూడా ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్ ప్రారంభమైతే వందలాది మంది వినియోగదారులు, వాహనాలతో ఆ మార్గం నిత్యం స్తంభించిపోవడం ఖాయమని, దీనివల్ల అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్లు వేగంగా స్పందించలేక భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
భారీ వాణిజ్య సముదాయాలకు అనుమతులిచ్చేటప్పుడు కనీసం పార్కింగ్ సౌకర్యాలు, రహదారి వెడల్పును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. నిబంధనల ప్రకారం సరిపడా పార్కింగ్ స్థలం లేని భవనానికి, పైగా సర్వీస్ రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణానికి వాణిజ్య అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఇదే ఆక్రమణను ఒక సామాన్యుడు లేదా పేదవాడు చేస్తే అధికారులు ఊరుకుంటారా? అని ప్రజలు నిలదీస్తున్నారు. డబ్బులు ఉన్న వారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయం అన్నట్లుగా అధికారుల వ్యవహారశైలి ఉందని ప్రజలు మండిపడుతున్నారు. పార్కింగ్ సౌకర్యం లేకపోతే వాహనాలన్నీ రోడ్డుపైనే నిలుపుతారని, దీనివల్ల పాదచారులు నడవడం కూడా దుర్భరమవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవినీతికి తావునిస్తూ, నిబంధనలను పక్కనబెట్టి ఇలాంటి భారీ వాణిజ్య సముదాయానికి అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అధికారులే చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. "అభివృద్ధి పేరిట ప్రజా భద్రతను పణంగా పెట్టవద్దు, నిద్రపోతున్న అధికారులు ఇకనైనా కళ్లు తెరవండి" అని ప్రజలు నినదిస్తున్నారు.
ప్రారంభోత్సవానికి ముందే పరిస్థితిని గుర్తించి, ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని లేదా అనుమతులను పునఃసమీక్షించాలని సూళ్ళూరుపేట పట్టణ ప్రజలు సంబంధిత ఉన్నతాధికారులను కోరుతున్నారు. ప్రజల భద్రతకు, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వివక్ష చూపకుండా చట్టాన్ని అమలు చేయాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.




