Sullurpeta: తడ వద్ద తప్పిన భారీ బస్సు ప్రమాదం
Sullurpeta: తడ సమీపంలో శ్రీసిటీ టీవీఎస్ కంపెనీ బస్సు ప్రమాదం. కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడిన బస్సులో 27 మంది ఉద్యోగులు ఉండగా, ఐదుగురికి గాయాలు.
Sullurpeta: తడ వద్ద తప్పిన భారీ బస్సు ప్రమాదం
Sullurpeta: తిరుపతి జిల్లా తడ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న శ్రీసిటీ టీవీఎస్ కంపెనీ బస్సు ప్రమాద స్థలాన్ని సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. నాయుడుపేట నుండి 27 మంది ఉద్యోగులతో శ్రీసిటీ వైపు వెళ్తున్న బస్సు, మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తడ స్మార్ట్ సిటీ హోటల్ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సీఐ ఎం.మురళీకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను, బస్సు పడిపోయిన తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. బస్సులో ఉన్న ఉద్యోగులను సురక్షితంగా బయటకు తీయడంలో పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు ఉద్యోగులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మిగిలిన 22 మంది ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని సీఐ స్పష్టం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.




