Chandragiri: ప్రైవేట్ సెక్యూరిటీ అరెస్ట్‌పై మండిపడ్డ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి

Chandragiri: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నా చేపట్టారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 11 Aug 2026 9:42 PM IST
Chandragiri
X

Chandragiri: ప్రైవేట్ సెక్యూరిటీ అరెస్ట్‌పై మండిపడ్డ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి

చంద్రగిరి: ఖాకీ చొక్కా వేసుకున్నంత మాత్రాన ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేస్తారా..? అలాగైతే పంచాయతీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, పరిశ్రమల్లో పనిచేసే కూలీలను కూడా అరెస్టు చేయాలి. తమ విధుల్లో భాగంగా ఖాకీ రంగును పోలిన యూనిఫాం ధరించిన ప్రయివేటు సెక్యూరిటీపై ప్రతాపం చూపుతారా..? చంద్రగిరిలో జరిగిన నిరసన ర్యాలీ విజయవంతమైందనే అక్కసుతో పోలీసులను ముందు పెట్టి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటోంది’’ అని రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆరోపించారు.

సోమవారం జరిగిన ర్యాలీలో ఉన్న ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న హర్షిత్‌రెడ్డి మంగళ వారం చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌ ముందు శాంతియుత నిరసన చేపట్టారు. ఆయనకు మద్దతుగా నియోజకవర్గంలోని పార్టీ నేతలు, విద్యార్థి విభాగం నాయకులు అక్కడికి చేరుకున్నారు.

సీఐ సురేష్‌కుమార్‌ నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. ప్రయివేటు సెక్యూరిటీని ఎందుకు అరెస్టు చేశారని హర్షిత్‌రెడ్డి ప్రశ్నించారు. విచారణకు తీసుకొచ్చామే తప్ప అరెస్టు చేయలేదన్న సీఐ.. ఆ తరువాత కొంత సేపటికే కేసు పెట్టినా విచారించి పంపిస్తామని చేప్పడంతో సెక్యూరిటీ సిబ్బందిని విడుదల చేసే వరకు కదిలేది లేదంటూ హర్షిత్‌రెడ్డి స్టేషన్‌ ముందు బైఠాయించారు.

ఇంతలో డీఎస్పీ ప్రసాద్‌, పాకాల సీఐ చిన్నగోవిందులు స్పెషల్‌ పార్టీ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం హర్షిత్‌రెడ్డిని బలవంతంగా సీఐ చాంబర్‌కు తీసుకెళ్లి విచారణలో ఉన్న ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని గంటలోపు విడిచి పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story