Tirupati: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: కిరణ్ రాయల్!

Tirupati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, రూ.7 కోట్ల వ్యవహారంపై సీఐడీ విచారణలో వాస్తవాలు బయటపడతాయని కిరణ్ రాయల్ బుధవారం తెలిపారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 18 Nov 2026 8:11 PM IST
Tirupati
X

Tirupati: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: కిరణ్ రాయల్!

తిరుపతి: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కార్యాలయంలో రూ.7 కోట్ల స్కామ్ జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించామని, విచారణలో వాస్తవాలు బయటపడతాయని స్పష్టం చేశారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్.. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా ఎన్నారై కోట రుక్మిణి జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారని, పవన్ కళ్యాణ్‌కు దగ్గరగా ఉన్నారనే కారణంతోనే ఆమెను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరణిపై 2021లోనే కేసు నమోదైందని తెలిపారు.

ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆమెను పార్టీకి దూరంగా పెట్టి, జనసేన తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఆరోపణల్లో వినిపిస్తున్న పెద్దిరాజుకు జనసేనతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. కేఎన్ఆర్, జగన్ పీఏలపై వచ్చిన ఆరోపణల విషయంలో అప్పటి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. భూకబ్జాలు, మద్యం స్కామ్‌లపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం వైసీపీ నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు.

రాజకీయ విమర్శల పేరుతో జనసేన మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. చెక్క నాగార్జున ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎడమచేత్తో వందల కోట్లు సాయం చేసిన వ్యక్తి అని, ఆయనపై రూ.7 కోట్ల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.