Mrunal Thakur Birthday : మృణాల్ బర్త్‌డే స్పెషల్.. రిజెక్షన్లను జయించి స్టార్‌గా మారిన 'సీత'.!
Mrunal Thakur Birthday : భారతీయ చిత్ర పరిశ్రమలో 'సీతారామం' సినిమాతో అడుగుపెట్టి, మొదటి చిత్రంతోనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని
Mrunal-Thakur
Mrunal Thakur Birthday : భారతీయ చిత్ర పరిశ్రమలో 'సీతారామం' సినిమాతో అడుగుపెట్టి, మొదటి చిత్రంతోనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఆగస్టు 1న ఆమె పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆమె జీవిత విశేషాలు, చిన్ననాటి ఆసక్తికర ముచ్చట్లు, సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారీ ప్రాజెక్టుల గురించిన పూర్తి వివరాలు మీకోసం..
చిన్నతనం, చదువు మధ్యలోనే స్వస్తి & నటనా మక్కువ
మృణాల్ ఠాకూర్ మహారాష్ట్రలోని ధులే గ్రామంలో ఒక సాంప్రదాయ మరాఠీ కుటుంబంలో ఆగస్టు 1, 1992న జన్మించారు. ఆమె తండ్రి బ్యాంక్ అధికారి కావడం వల్ల ఉద్యోగ రీత్యా తరచూ వేర్వేరు నగరాలకు మారాల్సి వచ్చేది. దీంతో ఆమె పాఠశాల విద్య వివిధ ప్రాంతాల్లో సాగింది. చిన్నతనం నుంచే అద్దం ముందు నిలబడి రకరకాల డ్రామాలు చేయడం, నటనను అనుకరించడం మృణాల్‌కి అలవాటుగా ఉండేది. మొదట్లో ఆమె తండ్రి కూతురిని డాక్టర్ లేదా బ్యాంక్ ఉద్యోగిగా చూడాలని ఆశపడినప్పటికీ, నటనపై ఆమెకున్న విపరీతమైన ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు.
ఉన్నత చదువుల కోసం ముంబై వచ్చిన మృణాల్, ప్రసిద్ధ కేసీ కాలేజీలో బిఎస్‌సి మాస్ మీడియా డిగ్రీలో చేరారు. అయితే కాలేజీ రోజుల్లోనే ఆమెకు బుల్లితెరపై నటించే అవకాశాలు రావడం మొదలైంది. ఒకవైపు షూటింగ్‌లు, మరోవైపు చదువు మేనేజ్ చేయడం కష్టమవ్వడంతో నటననే తన కెరీర్‌గా ఎంచుకుని డిగ్రీ చదువును మధ్యలోనే ఆపివేశారు.
రిజెక్షన్ల నుంచి 'లవ్ సోనియా' వరకు.. తొలినాళ్ల పోరాటం
కెరీర్ ప్రారంభంలో మృణాల్‌కి అనుకున్నంత సులభంగా అవకాశాలు రాలేదు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఆడిషన్స్ ఇస్తూ ఎన్నో రిజెక్షన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. "నువ్వు పక్కింటి అమ్మాయిలా ఉన్నావు, హీరోయిన్ మెటీరియల్ కాదు" అని పలువురు కామెంట్ చేసినా ఆమె అధైర్యపడలేదు. 'ముజ్సే కుచ్ కెహతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' వంటి టెలివిజన్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, ఆ తర్వాత హిందీ, మరాఠీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన 'లవ్ సోనియా' అనే ఇండీ చిత్రం ఆమె నటనలోని అసలైన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో కలసి నటించిన 'సూపర్ 30', జాన్ అబ్రహంతో 'బాట్లా హౌస్' , షాహిద్ కపూర్‌తో 'జెర్సీ' వంటి హిట్ చిత్రాలు ఆమెను బాలీవుడ్‌లో నిలబెట్టాయి.
'సీతారామం'తో సౌత్‌లో గ్రాండ్ ఎంట్రీ.. నేషనల్ క్రష్‌గా మారుమోగిన పేరు
ఏ నటికైనా కెరీర్‌ను మలుపు తిప్పే ఒక డ్రీమ్ రోల్ దొరుకుతుంది. మృణాల్ విషయంలో అది తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా లభించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమాలో 'సీత, నూర్జహాన్'గా ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతం. రాకుమారిగా ఆమె కనువిందు చేసిన రాయల్ లుక్, కళ్లలోనే భావాలు పండించిన నటన ప్రతిఒక్కరినీ కట్టిపడేసాయి. ఈ ఒక్క సినిమాతో మృణాల్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.
ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో నటించిన 'హాయ్ నాన్న' చిత్రం ఆమె నటనకు మరో మకుటంగా నిలిచింది. యష్ణ పాత్రలో తల్లిగా, ప్రేయసిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాయి. ఈ చిత్రాల విజయంతో దక్షిణాదిలో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది.
బాక్సాఫీస్ వద్ద వరుస ప్రాజెక్టులు..
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో విపరీతమైన బిజీ షెడ్యూల్‌ను గడుపుతున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ హంగులు ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న 'రాకా' లో కీలక పాత్రలో మృణాల్ నటిస్తోంది.
తెరపై సాంప్రదాయమైన చీరకట్టులో ఎంత దేవతలా కనిపిస్తుందో, వెస్ట్రన్ లుక్స్‌తోనూ సోషల్ మీడియాలో అంతే గ్లామర్ విందు చేస్తుంది మృణాల్. ఎంతటి ఎత్తుకు ఎదిగినా కొంచెం కూడా అహంకారం లేకుండా అందరితో ఆప్యాయంగా మెలిగే ఆమె నైజమే ఆమెను అందరి అభిమాన నటిగా మార్చింది. నేటితరం కథానాయికలలో నటనకు, పద్ధతికి పెద్దపీట వేస్తూ దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్‌కు పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు..




