World Horse Day 2026 : మానవ నాగరికతను మార్చిన ‘అశ్వాల’ గురించి ఆసక్తికర విశేషాలు.!

World Horse Day 2026 : వేల సంవత్సరాలుగా యుద్ధ క్షేత్రాల్లో యోధులను మోయడం నుండి, వ్యవసాయ రంగంలో నాగలి పట్టడం వరకు మానవ నాగరికత వికాసంలో

G Krishna
Updated on: 11 July 2026 12:11 PM IST
World Horse Day 2026
X

World Horse Day 2026

World Horse Day 2026 : వేల సంవత్సరాలుగా యుద్ధ క్షేత్రాల్లో యోధులను మోయడం నుండి, వ్యవసాయ రంగంలో నాగలి పట్టడం వరకు మానవ నాగరికత వికాసంలో గుర్రాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ గుర్రాల దినోత్సవం' (World Horse Day) జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ జూన్ 2025లో ఆమోదించిన తీర్మానం ప్రకారం.. ప్రతి సంవత్సరం జూలై 11ను ప్రపంచ గుర్రాల దినోత్సవంగా ప్రకటించారు. రవాణా, వ్యవసాయం, క్రీడలు, పర్యాటకం, జీవనోపాధి పరంగా వివిధ నాగరికతలకు గుర్రాలు చేసిన సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటుంది. ప్రస్తుతం మిషిన్స్ వచ్చినప్పటికీ ఒలింపిక్ క్రీడలు, పర్యాటకం, రక్షక దళాలు, థెరపీ ప్రోగ్రామ్స్‌లో గుర్రాల పాత్ర ఇప్పటికీ అమోఘంగా కొనసాగుతోంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన గుర్రాల జాతులు

ప్రపంచవ్యాప్తంగా గుర్రాలలో ఎన్నో రకాల జాతులు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ప్రత్యేక గుర్తింపును సాధించాయి. చరిత్రలోనే అత్యంత పురాతనమైన 'అరేబియన్' జాతి గుర్రాలు వాటి ఓర్పు, తెలివితేటలు , ప్రత్యేకమైన ముఖకవళికలకు ప్రసిద్ధి చెంది ఎక్కువ దూరం ప్రయాణించే పోటీల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ రేసింగ్ గుర్రంగా 'థోరోబ్రెడ్' జాతికి పేరుంది. అత్యంత వేగం, చురుకుదనం , పోటీతత్వం ఈ జాతి సొంతం. తక్కువ దూరాల్లో అత్యంత వేగంగా దూసుకెళ్లే 'క్వార్టర్' గుర్రాలను అమెరికాలో ఎక్కువగా ఫామ్ వర్క్స్, రిక్రియేషనల్ రైడింగ్ కోసం వాడతారు. నెదర్లాండ్స్‌కు చెందిన 'ఫ్రిసియన్' గుర్రం దాని ఒత్తైన నల్లటి జూలు, పట్టులాంటి కాళ్లతో చాలా ఆకర్షణీయంగా ఉండి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారీ శరీరంతో అపారమైన శక్తి కలిగిన 'క్లైడెస్‌డేల్' గుర్రాన్ని జెంటిల్ జెయింట్‌గా పిలుస్తారు. చివరగా, శరీరంపై ఉండే అందమైన మచ్చల చర్మం వల్ల సులభంగా గుర్తుపట్టేలా ఉండే 'అప్పలూసా' గుర్రాలు వాటి ప్రశాంతమైన స్వభావానికి గుర్తింపు పొందాయి.

గుర్రాల గురించి కొన్ని నమ్మశక్యం కాని నిజాలు

గుర్రాల శరీర నిర్మాణం, వాటి అలవాట్ల వెనుక ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు ఉన్నాయి. గుర్రాల శరీరంలో 'స్టే అపారటస్' అనే ప్రత్యేకమైన స్నాయువుల వ్యవస్థ ఉండటం వల్ల అవి తమ కాళ్లను లాక్ చేసుకుని నిలబడే నిద్రపోగలవు. అయితే గాఢ నిద్ర కావాలనుకున్నప్పుడు మాత్రం అవి కింద పడుకుంటాయి. వీటి కళ్లు తలకి ఇరువైపులా ఉండటం వల్ల గుర్రాలకు దాదాపు 360 డిగ్రీల దృష్టి ఉంటుంది. వీటికి కేవలం ముక్కు ముందు భాగం, తోక వెనుక భాగం అనే రెండు చిన్న బ్లైండ్ స్పాట్స్ మాత్రమే ఉంటాయి. గుర్రాలకు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ కాబట్టి తమకు అలవాటైన వ్యక్తులను, ప్రదేశాలను అవి సులభంగా గుర్తుపట్టగలవు. మానవులలా కాకుండా, గుర్రాల పళ్లు వాటి జీవితకాలంలో పెరుగుతూనే ఉంటాయి. నిరంతరం గడ్డి మేయడం వల్ల పళ్లు అరిగిపోకుండా ఉండేందుకు వీలుగా ప్రకృతి ఈ మార్పును ఇచ్చింది. వీటన్నిటితో పాటు గుర్రాలు తమ చెవుల కదలికలు, తోక ఊపడం, ముఖ కవళికల ద్వారా తమ భావాలను ఇతర గుర్రాలతో , మనుషులతో నిరంతరం పంచుకుంటూ ఉంటాయి.

మానసిక ఆరోగ్యానికి గుర్రాల తోడ్పాటు

ప్రస్తుత ఆధునిక కాలంలో గుర్రాలు కేవలం రవాణాకు మాత్రమే పరిమితం కాలేదు. శారీరక, మానసిక సవాలులను ఎదుర్కొంటున్న వారికి 'ఈక్విన్-అసిస్టెడ్ థెరపీ' ద్వారా మానసిక ప్రశాంతతను, భావోద్వేగ మద్దతును అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారికి గుర్రాలతో గడపడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఈ మూగజీవాల సంరక్షణ బాధ్యతను గుర్తుచేయడమే ఈ అంతర్జాతీయ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story