Off The Record: అర్థం పర్థం లేకుండా ముగిసిన పార్లమెంట్ సమావేశాలు!

Off The Record: పార్లమెంట్ సమావేశాలు చర్చలు లేకుండానే ముగియడం, నిరసనల నడుమ బిల్లులు ఆమోదం పొందడం మరియు ప్రజాధనం వృథా కావడంపై సమగ్ర విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Aug 2026 11:25 AM IST
Off The Record
X

Off The Record: అర్థం పర్థం లేకుండా ముగిసిన పార్లమెంట్ సమావేశాలు!

Off The Record: పోటాపోటీ నిరసనలు, వాయిదాల పర్వాలు. చర్చలు లేకుండానే బిల్లుల ఆమోదాలు. ఇది శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల తీరు. ఒక్క రోజు కూడా ఉభయ సభలు సజావుగా సాగలేదు. ఏ ఒక్క అంశంపై.. అర్థవంతమైన చర్చ జరగలేదు. నీట్ పేపర్స్‌ లీక్, జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ ఆందోళనలు, విద్యార్తులపై పెల్లెట్స్‌, లాఠీఛార్జీతో బలప్రయోగం, ఆయోధ్యలో విరాళాల చోరీ వంటి అంశాలే పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేశాయి. రాజకీయ పంతం నెగ్గించుకునే క్రమంలో అధికార, ప్రతిపక్షాలు నిరసనలతోనే సభా సమయాన్ని వృధా చేశాయి.

జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. ఉభయ సభలు 19 రోజుల పాటు సమావేశమయ్యాయి. వీటి నిర్వహణకు 197 కోట్ల రూపాయిలు వ్యయం అయింది. కానీ లోక్‌సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం మాత్రమే సద్వినియోగం అయ్యాయి. సభ్యుల..అరుపులు, కేకలు, నిరసనలు, వాయిదాలకే సమయం సరిపోయింది.

12 బిల్లులను ఆమోద ముద్ర పడింది. కానీ వాటిలో అత్యధిక బిల్లులు పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందడం చర్చనీయాంశంగా మారింది. పరీక్ష పేపర్ల లీక్‌ నిరోధక బిల్లుపై మాత్రమే 10 గంటలపాటు చర్చ జరిగింది. వందేమాతర గీతాన్ని అవమానించేవారిని శిక్షించేందుకు ఉద్దేశించిన జాతీయ గౌరవ అవమాన నిరోధక బిల్లు-2026పై ఇద్దరు సభ్యులు మాట్లాడారు. మైనింగ్‌ సంస్కరణలు, పన్నులు, ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు వంటి అంశాలకు సంబంధించిన బిల్లులు కూడా పెద్దగా చర్చ లేకుండానే సభలను దాటాయి.

సభా కార్యకలాపాలకు నిరసనలు, వాయిదాలు పదేపదే అడ్డంకిగా మారడంతో అనేక అంశాలపై చర్చకు అవకాశం లేకుండా పోయింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదింపజేసుకోలేకపోయింది. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలపటంతో ప్రభుత్వం దానిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది.

ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం వల్ల ఎక్కువ రోజులు వృధా అయ్యాయి. విద్యార్ధులపై లాఠీచార్జికి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ రాహుల్ గాంధీ సభలో ఆరోపించడంతో దానికే ఎక్కువ ప్రాముఖ్యం లభించింది. లాఠీచార్జి సంఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపట్టగా, అందుకు ఆయన అంగీకరించారు. ఈ సమావేశాల చివరి రోజైన గురువారం హోంమంత్రి ప్రకటన చేస్తారేమోనని ప్రతిపక్షాలే కాకుండా, యావత్ ప్రజానీకం ఎదురు చూసింది.

అయితే వారి ఆశ నిరాశే అయింది. 18 రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌ షా గురువారం లోక్‌సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి అడుగు పెట్టిన 4 నిమిషాలకే సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లులపై తగినంత చర్చ జరగకపోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసనల కారణంగానే సభా కార్యకలాపాలు సజావుగా సాగలేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు సభను అడ్డుకున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు విమర్శించారు. ఈ పరిణామాల మధ్యే సమావేశాలు ముగిశాయి. సభా సమయం వృఽథా కావటంపై రాజ్యసభ చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

చట్టాలు చేయడం మాత్రమే పార్లమెంట్‌ పని కాదు.

చట్టం ఎందుకు?

ఎవరికి ఉపయోగం?

ఎవరికి నష్టం?

దాని ప్రభావం ఏంటి?

ప్రజలపై భారం పడుతుందా?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే పార్లమెంటరీ చర్చ అసలు ఉద్దేశం.

కానీ ఒక బిల్లుపై మూడు నిమిషాలు.. మరో బిల్లుపై నాలుగు నిమిషాలు.. ఇంకో బిల్లుపై ఐదు నిమిషాలు మాత్రమే చర్చ జరిగితే.. చట్టం నాణ్యతపై ప్రశ్నలు రావడం సహజమే. పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు సుమారు నిమిషానికి 2.5 లక్షలు, గంటకు దాదాపు రూ.1.5 కోట్లు, పూర్తి రోజు కార్యకలాపాలకు సుమారు 9 కోట్లు ఖర్చవుతాయి. శీతాకాల సమావేశాల్లో 19రోజులు సభ నడవగా.. అందుకు 190 కోట్లకు పైనే ఖర్చు అయింది. సిబ్బంది, భద్రత, మౌలిక వసతులు వంటి ఖర్చులు కూడా వేరుగా ఉంటాయి.

ప్రజాధనంతో నడిచే పార్లమెంట్‌లో ప్రజల కోసం ఎంత సమయం పనిచేశారు..?

అన్న మౌళిక ప్రశ‌్న ఎదురవుతోంది.

సభలో నిరసన వ్యక్తం చేయడం ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య హక్కే. ప్రభుత్వం కూడా ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంది. ప్రభుత్వానికి జవాబుదారీతనం.. ప్రతిపక్షానికి నిర్మాణాత్మక విమర్శ.. ఇవన్నీ కలిసినప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలపడుతుంది.

ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షమే సభను అడ్డుకుందని ఆరోపించింది. ప్రతిపక్షం మాత్రం కీలక ప్రజా సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని వాదించింది.

అంటే..

నిందలు రెండు వైపులా ఉన్నాయి..

కానీ నష్టం మాత్రం ప్రజలదే!

ప్రజలు ఎంపీలను పార్లమెంట్‌కు పంపింది, ప్లకార్డులు పట్టుకోవడానికి కాదు,ప్రశ్నలు అడగడానికి.ప్రభుత్వాన్ని ఎన్నుకుంది, చట్టాలు చేయడానికే కాదు, ఆ చట్టాలపై సమగ్ర చర్చ జరగడానికి కూడా,రాజకీయ ప్రయోజనాల దృష్టిలో అధికార, ప్రతిపక్షాలు వ్యవహరిస్తే చివరికి నష‌్టం జరిగేది ప్రజలకే.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story