Burning Topic: లోక్ సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Burning Topic: లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి భారీ ఎదురుదెబ్బ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 April 2026 8:06 AM IST
Burning Topic
X

Burning Topic: లోక్ సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Burning Topic: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు లోక్‌సభలో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది.. బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేడంతో 2/3వంతు మెజార్టీ సాధించలేకపోయింది. సభకు హాజరైన 528 మందిలో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు అధికార పక్షం ప్రకటించింది. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్‌సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టేని భావిస్తున్నారు.

మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ చట్టానికి ఎన్డీయే ప్రభుత్వం కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. అయితే బిల్లులు వీగిపోవడం అధికార పక్షాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. తాజా పరిణామంతో 2023లో పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఢోకాలేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకులు తొలగలేదు. లోక్‌సభ సీట్లను 850కి పెంచి అందులో మూడోవంతు సీట్లను 2029 ఎన్నికల్లో మహిళలకు కేటాయించాలన్న ప్రక్రియకు మళ్లీ అడ్డుకట్ట పడింది. 2027 జనగణన వరకు ఆగకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తిచేసేందుకు వీలుకల్పించే ఆర్టికల్‌ 334ఎకి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, డీలిమిటేషన్‌ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఈ బిల్లుల ద్వారా లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, డీలిమిటేషన్‌ చట్టం ద్వారా నియోజకవర్గాలను తమ ఇష్టానుసారం మార్చుకొని 2029 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విపక్షాలు తమ వాదన వినిపించాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వీటిని తీసుకురావడం వెనక రాజకీయ ప్రయోజనం దాగుందని ఆరోపించాయి.దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని విపక్ష నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారుమహిళా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని, కానీ మహిళల హక్కుల్ని హరించే ప్రయత్నాలను అడ్డుకున్నాం అంటున్నారు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. ఇంకెవ్వరూ ఆ ప్రయత్నం చేయకుండా ఓ లక్ష్మణ రేఖను గీశామని తెలిపారు.

కాగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకొచ్చిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాల వైఖరి దేశ మహిళలకు అన్యాయం చేసిందని, ఈ విషయంలో వారు జీవితాంతం చింతించాల్సి వస్తుందని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై మోదీ స్పష్టంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆశలను తుంగలో తొక్కినట్లయిందని, ఈ నిర్ణయం రాజకీయంగా కూడా విపక్షాలకు భారీ మూల్యం చెల్లింపజేస్తుందని హెచ్చరించారు. కేంద్రానికి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పం ఉన్నప్పటికీ, విపక్షాలు అడ్డంకులు సృష్టించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. డీలిమిటేషన్ అంశాన్ని సాకుగా చూపిస్తూ బిల్లును అడ్డుకోవడం సరి కాదన్నారు.

కాగా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అవాంతరాలు కొత్తేమీ కాదు. ఇందు కోసం. తొలిసారిగా 1996లో అప్పటి ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని ప్రభుత్వం, ఆ ఇంద్రకుమార్ గుజ్రాల్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేశాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వమైతే వరసగా 1998 మొదలుకొని 2003 వరకూ నాలుగుసార్లు కోటా బిల్లుకు ప్రయత్నం చేసింది. యూపీయే ప్రభుత్వం కూడా 2008, 2010ల్లో ప్రయత్నించింది. కానీ ప్రతిసారీ బిల్లు ప్రతుల్ని చించేయటం, కూటమి నుంచి తప్పుకుంటామని బెదిరించటం వగైరాలతో అన్ని రకాల ప్రయత్నాలూ వీగిపోయాయి. మహిళా రిజర్వేషన్లలో వెనుబడిన వారికి కోటా ఇవ్వాలని కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. స్వాతంత్య్రంవచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా ఓబీసీలకు చట్టసభల్లో కోటా లేదని, మహిళల విషయంలోనైనా ఆ సంగతి తేల్చి తీరాలని ఆ పక్షాలు కోరాయి. ఈసారి పునర్విభజన ప్రక్రియ రూపంలో మరోసారి మహిళల రిజర్వేషన్లకు అడ్డుకట్టపడ్డట్లయింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story