Off The Record: వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిది ?
Off The Record: మూడు దశాబ్దాలుగా పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం. శంకుస్థాపనలు, టన్నెల్స్ నిర్మాణం పూర్తయినప్పటికీ రైతుల పొలాలకు నీరు ఎప్పుడు
Off The Record: వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిది ?
Off The Record: వెలిగొండ. ఇది 2004లో పుట్టిన ప్రాజెక్టు కాదు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అయితే 1990ల ప్రారంభంలోనే జీవం పోసుకుంది. 1991లో ప్రాజెక్టు ఫీజుబులిటీ పరిశీలనకు ఆదేశాలు వచ్చాయి. 1994లో మొదటి (DPR)- డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్దమైంది.
1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండకు శంకుస్థాపన చేశారు. అప్పటి అంచనా వ్యయం సుమారు 980 కొట్ల రూపాయలు. ఐదేళ్లల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ అనుమతులు, అటవీ, పర్యావరణ అంశాలు, సాంకేతిక సమస్యలతో పనులు ఆశించిన స్దాయిలో ముందుకు నడవలేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా పనులు ఎందుకు పుంజుకోలేదు అన్నది ప్రశ్న...? అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు తొలి రాజకీయ ట్యాగ్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అయింది. ఇది ప్రాజెక్టు క్రెడిట్ మాదే అని.
2004లో ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మరోసారి వెలిగొండకు శంకుస్దాపన చేసి, జలయజ్ఞంలో భాగంగా దీన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకున్నారు.
ఇక్కడి నుంచే పనులు వేగం పుంజుకున్నాయి. కాలువలు, రిజర్వాయర్, అనుబంధ పనులతో పాటు సొరంగాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది.
ఇదే సమయంలో సోరంగాల పనులు సవాలుగా మారడంతో పాటు సాంకేతిక సమస్యలు, కాంట్రాక్టు వ్యవహారాలు వంటి అంశాలు ప్రాజెక్టు జాప్యానికి కారణమయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ప్రభుత్వాలు మారిపోయాయి, రాష్ట్ర విభజన జరిగింది, ప్రాజెక్టు మాత్రం అదే ప్రశ్నతో ముందుకు సాగింది...వెలిగొండకు నీళ్లు ఎప్పుడు అని....!
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టిడిపి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ సమయంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధుల కేటాయింపు, విడుదలతో పనులు కొంత వేగంగానే ముందుకు సాగాయి.
కానీ ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టు పూర్తి లక్ష్యం మాత్రం నెరవేరలేదు. 2019లో టీడీపీ ప్రభుత్వం మారే సమయానికి ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అప్పటి నుంచి వెలిగొండపై రాజకీయ లెక్కలు ప్రారంభం అయ్యాయి.
మా హయాంలో ఇంత ఖర్చు చేశాం అంటే లేదు లేదు మా ప్రభుత్వం వచ్చాకే పనులు వేగవంతం చేశామని, మా వల్లే ప్రాజెక్టు కీలక దశకు చేరుకుందంటూ అధికార, ప్రతిపక్షాల మద్య క్రెటిట్ వార్ మొదలైంది. కానీ రైతులు మాత్రం రాజకీయ లెక్కలు మాకు అవసరం లేదు, తమ పొలాలకు వచ్చే నీటి లెక్కలు చెప్పండి అని అడగడం ప్రారంభించారు.
2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలిగొండ సొరంగాల పనులకు ప్రత్యేక దృష్టి సారించింది. 2021 జనవరిలో తొలి సొరంగం పూర్తైంది. ఆ తరువాత రెండవ సొరంగం పనులు కొనసాగాయి.
2024మార్చిలో రెండు సొరంగాల తవ్వకాలు పూర్తి అయ్యాయి. జగన్ ప్రభుత్వం ట్విన్ టన్నెల్స్ పనులను పూర్తి చేసి, 2024 మార్చి 6న వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేసింది. కానీ ఇది కేవలం రాజకీయ మైలేజ్ కోసమే అనే వాదన కూడా ఉంది.
కేవలం టన్నల్స్ మాత్రమే పూర్తి అయ్యాయి కానీ ప్రాజెక్ట్ పనులు ఏవీ పూర్తిస్దాయిలో పూర్తి కాలేదనే వాదన బలంగా ఉంది. ఇదే ప్రాజెక్టులో కీలక మైలు రాయి. ఇక్కడి నుంచి రాజకీయ క్రెడిట్ మరింత వేడెక్కింది. టన్నెల్ పూర్తి చేసింది మేమే అని, అంతకు ముందు పనులు చెయ్యడం వలనే టెన్నల్స్ సాధ్యం అయ్యాయి అని..వెలిగొండ నీళ్ల కంటే రాజకీయ క్రెడిట్ పైనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ఎక్కువ అయింది.
2024లో మళ్లీ ప్రభుత్వం మారడంతో...అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెలిగొండను పూర్తి చేయ్యడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతే కాకుండా ప్రాజెక్టు కోసం భూములు , ఇండ్లు కోల్పోయిన నిర్వాసితుల పునరావాసం కూడా కీలకంగా మారింది.
ప్రాజెక్టు పనులతో పాటు లింక్ కాలువలు, పంపిణీ వ్యవస్ద ఇతర అనుబంధ పనులు, నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారించాల్సి ఉంది. 1994లో DPR వచ్చే సమయంలో 980 కొట్ల రూపాయల అంచనా వ్యవయం కాస్తా. 2026 నాటికి అంచనా వ్యయం 10,580 కొట్లకు చేరింది. ఇప్పటి వరకు సుమారుగా 6,736 కోట్లు ఖర్చు అయ్యాయని మరో 3,844 కోట్లు అవసరం అని ప్రభుత్వం చెబుతుంది.
అంతే కాకుండా 2024 తరువాత సుమారుగా 759 కోట్లు ఖర్చు చేసినట్లుగా కూడా చెబుతున్నారు. వెలిగొండకు 2014 వరకు 3,581.67 కోట్లు ఖర్చయ్యాయి. 2014–19 మధ్య మరో 1,414 కోట్లు, 2019 తర్వాత సుమారు 952 కోట్ల వ్యయంగా నమోదైంది.
2026 నాటికి మొత్తం వ్యయం 6,736 కోట్లకు చేరింది. ప్రస్తుత అంచనా వ్యయం 10,580 కోట్లు కాగా, ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా 3,844 కోట్లు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ఆయకట్టు రైతులకు నీళ్లు అందించడమే కాదు..
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత మెట్ట ప్రాంతాలకు కృష్ణా వరద జలాలను తీసుకెళ్లి సాగు నీటి స్థిరత్వాన్ని పెంచడం కూడా. ప్రాజెక్టు లక్ష్యం సుమారు 4.38 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కల్పించడం, అలాగే మూడు జిల్లాల్లో 15 లక్షల మందికి తాగునీరు అందించడం.
వెలిగొండ ప్రాజెక్టుకు ప్రతిపాదన దశ నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో ప్రభుత్వాల మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ప్రభుత్వం చెబుతోంది,, వెలిగొండకు మేమే దిక్సూచి అని, కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న మాత్రం ఒక్కటే..దిక్సూచి ఎవరిదైనా పర్లేదు.. దిక్కు ఏదైనా పర్లేదు..
నీళ్లు ఎప్పుడు వస్తాయి అని. వెలిగొండ క్రెడిట్ ఎవరిది అన్నది చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయి..? రైతుల పొలానికి నీరు ఎప్పుడు చేరుతుంది..? అన్నది మాత్రం ప్రస్తుత ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. శంకుస్థాపనల కాలం ముగిసింది.. సొరంగాల కాలం కూడా ముగిసింది. ఇక కావాల్సింది ఒక్కటే — వెలిగొండ నుంచి నీరు పారుడమే.




